UP's Raebareli: ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో రైలు ప్రమాదానికి కుట్ర

ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ జిల్లాలో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై మట్టి కుప్ప దర్శనమిచ్చింది.

Update: 2024-10-07 07:12 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ జిల్లాలో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై మట్టి కుప్ప దర్శనమిచ్చింది. లోకో పైలట్లు ఆ మట్టికుప్పను గుర్తించడంతో ప్యాసింజర్ రైలుకు ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారుజామున రాయ్‌బరేలిలోని రఘురాజ్ సింగ్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. లోకో పైలట్ల నుంచి అలర్ట్ రావడంతో ట్రాక్‌పై మట్టిని తొలగించి ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనపై రాయబరేలీ పోలీసు అధికారి మాట్లాడుతూ.. రైల్వే ట్రాక్‌ ని మట్టి కుప్పతో కప్పివేశారన్నారు. అప్రమత్తమైన లోకో పైలట్లు ప్యాసింజర్ రైలును నిలిపివేశారని వెల్లడించారు.

రాయ్ బరేలీలో రోడ్డు నిర్మాణం

రాయ్ బరేలీలో రోడ్డు నిర్మాణం జరుగుతోందని, రాత్రి పూట మట్టిరవాణాకు డంపర్లను వాడుతారని స్థానికులు తెలిపారన్నారు. ఆదివారం సాయంత్రం మట్టి తీసుకువెళుతున్న డంపర్ డ్రైవర్ రైల్వే ట్రాక్‌పై లోడ్‌ను పడవేసి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ అంశంపై తదుపరి విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. ఇకపోతే, ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలోని పెరంబూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై ఎల్‌పిజి సిలిండర్ కనిపించడంతో పెద్ద రైలు ప్రమాదం త్రుటిలో తప్పింది.


Similar News