NEET UG : ‘నీట్‌-యూజీ’ రివైజ్డ్‌ ఫలితాలపై గందరగోళం.. విద్యాశాఖ క్లారిటీ

దిశ, నేషనల్ బ్యూరో : ‘నీట్‌ - యూజీ 2024’ పరీక్షకు సంబంధించిన రివైజ్డ్ ఫలితాలపై గురువారం సాయంత్రం అయోమయం ఏర్పడింది.

Update: 2024-07-25 16:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘నీట్‌ - యూజీ 2024’ పరీక్షకు సంబంధించిన రివైజ్డ్ ఫలితాలపై గురువారం సాయంత్రం అయోమయం ఏర్పడింది. ఈ రిజల్ట్స్ వచ్చాయంటూ తొలుత జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ‘నీట్‌ రివైజ్డ్‌ స్కోర్‌ కార్డు’ పేరుతో ఒక లింక్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు. అయితే అది తెరుచుకోలేదు. దీంతో విద్యార్థులు ఫలితాలు తెలుసుకోవడంలో ఇబ్బందిపడ్డారు. ఈలోగా కేంద్ర విద్యాశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘నీట్-యూజీ’ రివైజ్డ్‌ స్కోర్‌ కార్డుల్ని ఇంకా విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ఇంకా పాత లింక్‌నే చూపిస్తోందని తెలిపింది. దీంతో నీట్-యూజీ రివైజ్డ్ రిజల్ట్స్ వచ్చినట్టా ? కాదా ? అనే దానిపై విద్యార్థుల్లో అయోమయం నెలకొంది. గురువారం అర్ధరాత్రికల్లా ఈ ఫలితాలు ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని జాతీయ మీడియా సంస్థలు తమ వార్తల్లో ప్రస్తావించాయి.

ఎందుకీ రివైజ్డ్ రిజల్ట్స్ ?

నీట్-యూజీ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంలోని ఫిజిక్స్‌ విభాగంలో ఉన్న అటామిక్‌ థియరీకి సంబంధించిన 29వ ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ అభ్యర్థి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ‘‘ఒక ప్రశ్నకు ఒకే జవాబు ఉండాలి. కానీ 29వ ప్రశ్నకు రెండు సమాధానాలను ఎన్‌టీఏ కన్ఫార్మ్ చేసింది. దీనివల్ల ఆ రెండింటిలో ఏదో ఒకటి టిక్ చేసిన వారికి చెరో నాలుగు మార్కులు వచ్చాయి. అయితే నెగెటివ్ మార్కింగ్ భయంతో ఆ ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేసిన నా లాంటి అభ్యర్థులకు నష్టం జరిగింది’’ అని సదరు అభ్యర్థి కోర్టుకు తెలిపాడు. దీంతో ఆ ప్రశ్నకు సరైన సమాధానమేదో తేల్చాలని ఐఐటీ ఢిల్లీని దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఐఐటీ ఢిల్లీ నియమించిన ముగ్గురు నిపుణుల కమిటీ.. 29వ ప్రశ్నకు ‘ఆప్షన్ 4’ సరైన సమాధానమని తేల్చింది. దీంతో ఆప్షన్‌ 4ను ఎంచుకున్న అభ్యర్థులకు మాత్రమే మార్కులు ఇవ్వాలని ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు మార్పుతో సవరించిన నీట్-యూజీ రిజల్ట్స్‌ను ఎన్‌టీఏ రిలీజ్ చేయాల్సి ఉంది.

కీలక నిందితుడి 16 ఫోన్లు.. చెరువులో నుంచి స్వాధీనం

జార్ఖండ్ కేంద్రంగా జరిగిన నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తులో కీలక పురోగతి చోటుచేసుకుంది. ధన్‌బాద్‌కు చెందిన నిందితుడు అవినాష్‌ అలియాస్‌ బంటీకి సంబంధించిన 16 ఫోన్లను టవర్‌ సిగ్నల్స్‌ ద్వారా ట్రాక్‌ చేసి సీబీఐ అధికారులు చెరువులో నుంచి స్వాధీనం చేసుకున్నారు. అతడిని బిహార్‌లోని పాట్నా సీబీఐ కోర్టులో హాజరుపరచగా, జులై 30 వరకు కస్టడీకి కోర్టు అప్పగించింది.పేపర్‌ లీక్‌ వ్యవహారంలో అరెస్టయిన శశి పాసవాన్‌తో అవినాష్‌‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. నీట్‌ ప్రశ్నపత్రాల కోసం కొందరు అభ్యర్థులు రూ.35 నుంచి 60 లక్షల వరకు చెల్లించినట్లు ప్రాథమిక దర్యాప్తులో సీబీఐ గుర్తించింది.

Tags:    

Similar News