Haryana Polls: హర్యానాలో ఆప్ దూకుడు.. 40 మంది స్టార్ క్యాంపెయినర్ల ప్రకటన

కాంగ్రెస్‌తో పొత్తు విచ్ఛిన్నం కావడంతో హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూకుడు పెంచింది.

Update: 2024-09-11 15:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌తో పొత్తు విచ్ఛిన్నం కావడంతో హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) దూకుడు పెంచింది. ఇప్పటికే పలు జాబితాల్లో అభ్యర్థులను వెల్లడించిన ఆప్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి గాను 40 మంది స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఢిల్లీ మంత్రులు అతిశీ, సౌరభ్ భరద్వాజ్, ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియాలు ఉన్నారు. వీరంతా ఆప్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియా కలయత్ స్థానం నుంచి అభ్యర్థి అనురాగ్ దండా నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. హర్యానాలో ఆప్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు.

మరోవైపు, మంగళవారం నాటికి మూడు జాబితాల్లో అభ్యర్థుల పేర్లను వెల్లడించిన ఆప్.. బుధవారం మరో రెండు జాబితాల్లో క్యాండిడేట్స్‌ను ప్రకటించింది. మొదట 21 మందిని వెల్లడించగా..ఆ తర్వాత కాసేపటికే మరో 9 మంది పేర్లను ఖరారు చేసింది. దీంతో 5 జాబితాల్లో ఇప్పటివరకు 70 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 20 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగట్‌పై మాజీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ రెజ్లర్ కవితా దలాల్‌ను పోటీకి దింపింది.


Similar News