NIA: జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన వ్యక్తి అరెస్టు
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పాకిస్థాన్ కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్ (JeM)కు చెందిన షేక్ సుల్తాన్ సలాఉద్దీన్ ఆయూబీని అరెస్టు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పాకిస్థాన్ కు చెందిన ఉగ్రసంస్థ జైషే మహ్మద్ (JeM)కు చెందిన షేక్ సుల్తాన్ సలాఉద్దీన్ ఆయూబీని అరెస్టు చేసింది. భారత్ వ్యాప్తంగా పేలుళ్లకు పెద్ద కుట్ర పన్నుతున్నట్లు తేల్చింది. ఉగ్రదాడి, ఉగ్రకుట్ర కేసులో ఆయూబీని ఎన్ఐఏ అరెస్టు చేసింది. శనివారం అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్ముకశ్మీర్ లోని 26 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. కాగా.. ఈ దాడుల తర్వాతే ఆయూబీని అరెస్టు చేసింది. సోదాల సమయంలో దర్యాప్తు అధికారులు నేరారోపణ పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, కరపత్రాలు సహా పలు మ్యాగజైన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వ్యక్తులను రాడికలైజ్ చేయడం, జైషే ప్రచారాన్ని వ్యాప్తి చేయడం, హింసాత్మక ఉగ్రకార్యకలాపాల కోసం యువకులను రిక్రూట్ చేస్తున్నారని తేల్చింది. భారతదేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించినట్లు అధికారులు కనుక్కున్నారు.
జూలైలో ఇద్దరు అరెస్టు
జూలైలో జమ్ముకశ్మీర్ పోలీసులు జైషేకి చెందిన ఇద్దరు ఓవర్‌గ్రౌండ్ కార్మికులను అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. కేంద్ర పాలిత ప్రాంతంలోని కథువాలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇకపోతే, అరెస్టయిన నిందితుడికి జూలై 8న కథువాలో భారత ఆర్మీ వాహనాలపై జరిగిన ఉగ్రదాడితో సంబంధం ఉందని అధికారులు భావిస్తున్నారు. కథువా ఉగ్రదాడులో ఐదుగురు జవాన్ల ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.