ఖట్టర్ సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం

అవిశ్వాస తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా మంగళవారం అంగీకరించారు.

Update: 2024-02-20 14:45 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా మంగళవారం అంగీకరించారు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన చర్చను ఈ నెల 22న నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఇటీవలే ప్రతిపక్ష నేత భూపిందర్ సింగ్ హుడా, ఖట్టర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొస్తుందని ముందే చెప్పారు. మూడేళ్ల క్రితం బీజేపీ-జేజేపీ(జననాయక్ జనతా పార్టీ) ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం తెచ్చినప్పటికీ అది వీగిపోయింది. ఈ మధ్యే సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ గతంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావించారు. ప్రతి అసెంబ్లీ సెషన్‌లోనూ తమ ప్రభుత్వం చేస్తున్న పని గురించి తెలుసుకునేందుకు ప్రతిపక్షాలు తప్పనిసరిగా ఇటువంటి తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సవాల్ విసిరారు. కాగా, ప్రస్తుతం హర్యానా అసెంబ్లీలో 90 మంది సభ్యులు ఉన్నారు. వారిలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. భాగస్వామి (జేజేపీ)కి 10 మంది ఉన్నారు. ఇక, సభలోని ఏడుగురు స్వతంత్ర సభ్యుల్లో ఆరుగురు బీజేపీకి మద్దతిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలున్నారని, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్ఎల్‌డీ)కి ఒకరు మద్దతుగా ఉన్నారు.

Tags:    

Similar News