Haryana election: కాంగ్రెస్ చేతిలో పడితే హర్యానా నాశనమే.. మోడీ
హర్యానాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వ నాశనం అవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఆ పార్టీకి ఓటు వేయడం అంటే హర్యానా సుస్థిరత, అభివృద్ధిని పణంగా పెట్టడమేనని ఆరోపించారు. సోనిపట్ జిల్లాలోని గోహనాలో బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ ఆశలు సన్నిగిల్లుతున్నాయని చెప్పారు. ఆ పార్టీ ఎక్కడ కాలు పెట్టినా అవినీతి, బంధుప్రీతికే జై కొడుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా దళితులు, అణగారిన వర్గాల హక్కులను లాక్కుందని ఫైర్ అయ్యారు. హర్యానాలో కాంగ్రెస్ విజయం సాధిస్తే ఆ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు కారణంగా అభివృద్ధి ప్రమాదంలో పడుతుందని, ఇది రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని నొక్కి చెప్పారు. కాబట్టి హర్యానా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కాంగ్రెస్ 60 ఏళ్లు దేశాన్ని పాలించినా దేశ ఆడబిడ్డల గురించి ఏనాడూ ఆలోచించ లేదన్నారు. కానీ బీజేపీ హయాంలో బేటీ బచావో-బేటీ పఢావో ప్రచారాన్ని ప్రారంభించగా.. ఇది హర్యానాకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందన్నారు. హర్యానాలో బీజేపీకి రోజు రోజుకూ మద్దతు పెరుగుతోందని తెలిపారు. బీజేపీ హయాంలో పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో హర్యానా అగ్రస్థానంలో నిలిచిందన్నారు. హర్యానాలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు భారతదేశంలో కర్మాగారాలను స్థాపించడానికి ఆసక్తి చూపుతున్నాయని, పారిశ్రామికీకరణ పెరిగినప్పుడు, దాని ప్రయోజనాలు పేదలు, రైతులు, దళితులకే చెందుతాయన్నారు.