న్యూఢిల్లీ : మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా పర్యటనకు బీసీసీఐ ముగ్గురు కెప్టెన్ల సారథ్యంలో వేర్వేరు జట్లను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా భారత జట్టు ఎంపికపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన యూట్యూబ్ చానెల్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘టీ20 జట్టులో చాహల్‌కు చోటు దక్కలేదు. వన్డే జట్టుకు మాత్రం ఎంపిక చేశారు. అతనికి ఓ లాలీపాప్ ఇచ్చి ఊరుకోబెట్టినట్టు ఉంది. ఇది ఎలా ఉందంటే.. మీరు బాగా ఆడే ఫార్మాట్‌లో మేము తీసుకోం.. మరో ఫార్మాట్‌కు తీసుకుంటామని చెప్పినట్టు ఉంది.
ఇది నాకైతే అర్థం కాలేదు.’ అని తెలిపాడు. ఆగస్టు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ తర్వాత టీ20 జట్టులో చోటు కోల్పోయిన చాహల్.. సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికయ్యాడు. సీనియర్లు రహానే, పుజారాలను పక్కనపెట్టడంపై కూడా హర్భజన్ సింగ్ మాట్లాడాడు. ‘పుజారా, రహానె జట్టుకు ఎంతో సేవ చేశారు. బోర్డు వారితో మాట్లాడాల్సింది. వారిని తీసుకోకపోవడానికి గల కారణాలను వివరించాల్సింది.’ అని చెప్పుకొచ్చాడు.