Hamas Chief: ఇస్మాయిల్ హనియా దారుణ హత్య

హమాస్ పై ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు.

Update: 2024-07-31 06:09 GMT

దిశ, నేషనల్ బ్యూరో: హమాస్ పై ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఇరాన్ లో హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని ఇరాన్‌ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రకటించింది. హమాస్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ కూడ హమాస్ చీఫ్ మరణాన్ని ధ్రువీకరించింది. టెహ్రాన్‌లోని తన నివాసంలో జరిగిన దాడిలో ఇస్మాయిల్ హనియా, ఆయన బాడీగార్డ్ చనిపోయినట్లు వెల్లడించింది. ఇరాన్‌ (Iran) నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యి.. ఇంటికి వచ్చిన తర్వాత దాడి జరిగినట్లు సమాచరం. కాగ.. ఈ ఘటనపై దర్యప్తు మొదలైంది.

పిరికిపంద చర్య

ఇది ఇజ్రాయెల్ చేసిన దాడి అని హమాస్ పేర్కొంది. హమాస్ సీనియర్ అధికారి ఇస్మాయిల్ హనియెహ్ హత్యకు జవాబిస్తామని ఇజ్రాయెల్ ని హెచ్చరించింది. ఇస్మాయిల్ హనియా హత్య పిరికిపంద చర్య అని హమాస్ నాయకుడు మూసా అబు మర్జుక్ అభివర్ణించారు. ఏనాయకుడు చనిపోయినా.. హమాస్ యుద్ధం కొనసాగేంత బలంగా ఉందని పేర్కొన్నారు. టెహ్రాన్ లోని హనియ ఇంటిపై వైమానిక దాడి జరపడంతో ఆయన చనిపోయినట్లు హమాస్ ప్రకటించింది. దాడి మాత్రం ఎలా జరిగిందో వివరాలు వెల్లడించలేదు. ఐఆర్జీసీ దర్యాప్తు జరుగుతోందని ఇరాన్ తెలిపింది. కాగా.. హనియా హత్యపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. అయితే, అక్టోబరు 7న ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడిలో వెయ్యికి పైగా పౌరులు చనిపోయారు. అయితే, హనియేను చంపి హమాస్ గ్రూపుని నాశనం చేస్తామని అప్పట్లో ఇజ్రాయెల్ ప్రతిజ్ఞ చేసింది.

హమాస్ నేతగా హనియా

హనియా 1962లో గాజా సిటీకి సమీపంలోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించాడు. 1980ల చివర్లో తొలి ఇంతిఫాదా సమయంలో హమాస్‌లో చేరాడు. 1990లో తొలిసారిగా హనియా పేరు బయటకు వచ్చింది. హమాస్‌ వ్యవస్థాపకుడు అహ్మద్‌ యాసిన్‌కు ఇతడు అత్యంత సన్నిహితుడు. రాజకీయపరంగా అవసరమైన సలహాలిస్తూ ఆయనకు అత్యంత సన్నిహితుడిగా మారాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ సంస్థలో అనేక ర్యాంక్‌లు చేపట్టి..హమాస్ చీఫ్ గా మారాడు. 2004లో ఇజ్రాయెల్‌ చేపట్టిన దాడుల్లో అహ్మద్‌ యాసిన్‌ హతమయ్యాడు. అప్పట్నించి హమాస్ సంస్థలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో హనియా

2006లో పాలస్తీనా స్టేట్‌ ప్రధాని హనియ ఎన్నికయ్యాడు. అయితే, 2007 జూన్‌లో పాలస్తీనా నేషనల్‌ అథారిటీ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ అతడిని పదవి నుంచి తొలగించారు. అప్పట్నుంచే గాజలో ఫతా- హమాస్ యుద్ధం జరుగుతోంది. దీంతో అబ్బాస్‌ ఆదేశాలను పక్కనపెట్టి గాజాలో ప్రధాని బాధ్యతల్లో కొనసాగాడు. 2017 హమాచ్‌ చీఫ్‌గా మారాడు. ఆ తర్వాత అమెరికా అతడిని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. 2019లో గాజాని వీడాడు. అప్పట్నుంచి ఖతర్ లో నివసిస్తున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హనియా ముగ్గురు కుమారులు, నలుగురు మనవళ్లు, మనవరాళ్లు మరణించినట్లు అప్పట్లో హమాస్‌ ప్రకటించింది.


Similar News