మణిపూర్‌లో వడగళ్ల వాన బీభత్సం: భారీగా దెబ్బతిన్న ఇళ్లు, వాహనాలు!

ఇప్పటికే కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం భారీగా వర్షం కురవడంతో పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి.

Update: 2024-05-06 05:51 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇప్పటికే కుకీ, మెయితీ తెగల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఆదివారం భారీగా వర్షం కురవడంతో పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. అంతేగాక పంటలకు సైతం అపార నష్టం వాటిల్లింది. మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం అర్థరాత్రి వరకు కొనసాగినట్టు తెలుస్తోంది. ఈ కారణంగా ఇంఫాల్ లోయతో సహా పలు ప్రాంతాల్లో అధిక నష్టం ఏర్పడినట్టు తెలుస్తోంది. కూరగాయలు, పండ్ల తోటలు, పూర్తిగా నాశనమైనట్టు సమాచారం. ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న వారికి వడగళ్ల వాన కారణంగా తలకు గాయాలైనట్టు అధికారులు తెలిపారు. అలాగే బయట పార్క్ చేసి ఉన్న వాహనాలపై రాళ్లు పడటంతో ధ్వంసమైనట్టు వెల్లడించారు. బలమైన గాలులకు వివిధ ప్రాంతాల్లోని గుడిసెలు నేలకొరిగాయి.

ఈ ఘటనలపై సీఎం బిరేన్ సింగ్ స్పందించారు. దెబ్బతిన్న ఇళ్లను మరమ్మతులు చేసుకునేందుకు ఆర్థిక సాయం అందజేస్తామని తెలిపారు. దీనికి గాను తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బాధితులు వెంటనే అధికారులు సంప్రదించాలని కోరారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు ప్రకటించారు. మణిపూర్ వాతావరణ శాఖ డైరెక్టర్ డాక్టర్ టౌరంగ్ బామ్ బ్రజ్ కుమార్ మాట్లాడుతూ..తుపాను కారణంగా వర్షం కురిసిందని తెలిపారు. తమెంగ్‌లాంగ్ జిల్లాలో అత్యధికంగా 21.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించారు.  

Tags:    

Similar News