Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదు ముమ్మాటికీ శివాలయమే.. యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు

జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-14 12:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జ్ఞానవాపి మసీదు కాదని అది వాస్తవానికి శివాలయమని తెలిపారు. కానీ దురదృష్టవ శాత్తు ప్రజలు దానిని మసీదుగా పిలుస్తున్నారని చెప్పారు. గోరఖ్ పూర్‌లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఈ ప్రాంతం భక్తి, జాతీయ సమైఖ్యత రెండింటినీ అడ్డుకుంటుందన్నారు. పూజలు, ప్రార్థనలు చేయడానికి అక్కడికి వచ్చే హిందూ ముస్లిం భక్తులు ఈ గందరగోళంపై విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గతంలోనే ఈ అడ్డంకిని గుర్తించి, సమస్యను పరిష్కరించినట్లయితే మన దేశం ఎన్నటికీ వలసరాజ్యంగా ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కాగా, జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న బేస్‌మెంట్‌లోని ‘వ్యాస్ జీ కా తెహ్‌ఖానా’ను మరమ్మతులు చేయాలని స్థానిక జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించాలని కోరుతూ హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్‌ను వారణాసి కోర్టు తిరస్కరించిన కొద్ది రోజులకే ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  


Similar News