Gujarath Rains: గుజరాత్‌లో వర్ష బీభత్సం.. ఏడుగురు మృతి

గత నాలుగు రోజులుగా గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయి.

Update: 2024-08-27 14:20 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత నాలుగు రోజులుగా గుజరాత్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లోని అనేక గ్రామాలు నీట మునిగాయి. మంగళవారం వరకు కురిసిన వర్షాల వల్ల వివిధ ఘటనల్లో ఏడుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. గాంధీనగర్, ఖేడా, వడోదర జిల్లాల్లో గోడ కూలిన ఘటనల్లో నలుగురు మృతి చెందగా, ఆనంద్ జిల్లాలో చెట్టు కూలడంతో ఒకరు, మరో ఇద్దరు నీటిలో మునిగి మరణించారు. డ్యామ్‌లు, నదుల్లో నీటి మట్టాలు పెరగడంతో 6,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వెల్లడించారు. పంచమహల్, నవ్సారీ, వల్సాద్, వడోదర, భరూచ్, ఖేడా, గాంధీనగర్, బోటాడ్, ఆరావళి జిల్లాల్లో నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నట్టు తెలిపారు.

తూర్పు రాజస్థాన్ నుంచి సౌరాష్ట్ర ప్రాంతం వైపు కదులుతున్న అల్పపీడనం కారణంగా గురువారం వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసింది. రాబోయే రెండు మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచించింది. ప్రస్తుతం వల్సాద్, తాపీ, నవ్సారీ, సూరత్, నర్మద, పంచమహల్ జిల్లాలు అధికంగా దెబ్బతిన్నాయని సీఎం భూపేంద్ర పటేల్ కార్యాలయం తెలిపింది. రాష్ట్రంలో 17,827 మందిని తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయగా.. 1,653 మందిని రక్షించారు. 13 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు చేపట్టాయి. 


Similar News