Gujarath rains: గుజరాత్ జలమయం.. భారీ వర్షాలతో నీట మునిగిన పలు ప్రాంతాలు

గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి.

Update: 2024-08-26 14:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ వర్షాలు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో అన్ని ప్రాథమిక పాఠశాలలను మంగళవారం మూసివేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా తెలిపారు. గాంధీనగర్‌లోని సంత్ సరోవర్ డ్యామ్‌లో నీటిమట్టం నిరంతరం పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నవ్‌సారి జిల్లా గుండా ప్రవహించే కావేరీ, పూర్ణ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రమాద స్థాయిని దాటిన కావేరీ నది ఖేర్గాం తాలూకాలోని పలు గ్రామాలకు చేరుకుంది. కావేరీ నది వరదల కారణంగా ఈ గ్రామాలకు చెందిన సుమారు 500 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాష్ట్రంలోని పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో సమీక్షించారు. కేంద్రం నుంచి కావాల్సిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.


Similar News