Gujarat rain: వరదల వల్ల ఇప్పటివరకు 28 మంది మృతి.. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్

గుజరాత్ లో మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మంది చనిపోయారు.

Update: 2024-08-29 04:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ లో మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 28 మంది చనిపోయారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 18,000 మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. మోర్బి జిల్లాలోని ధావానా సమీపంలో పొంగిపొర్లుతున్న కాజ్ వేను దాటుతుంగా ట్రాలీ కొట్టుకుపోయింది. దీంతో, ట్రాలీలో ప్రయాణిస్తున్న ఏడుగురు చనిపోయారు. ఇకపోతే, గుజరాత్ లోని 11 జిల్లాల్లో రెండ్రోజులపాటు వర్షాలు భారీగా కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కచ్ఛ్, ద్వారక, జామ్‌నగర్, మోర్బి, సురేంద్రనగర్, జునాగఢ్, రాజ్‌కోట్, బోటాడ్, గిర్ సోమనాథ్, అమ్రేలి, భావ్‌నగర్ జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నార్త్, సౌత్, సెంట్రల్ ప్రాంతాల్లోని 22 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది.

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. గుజరాత్ వ్యాప్తంగా నదులు, డ్యామ్‌లలో నీటి మట్టాలు పెరగాయి. సుమారు 6,000 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. వడోదరాలో వర్షం ఆగిపోయినప్పటికీ.. విశ్వామిత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. మరోవైపు భారీ వర్షం కారణంగా వడోదరలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్లే రహదారి దెబ్బతింది. రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్లలో ఆరు ఆర్మీ బృందాలు పాల్గొంటున్నాయి. ద్వారక, ఆనంద్‌, వడోదర, ఖేడ, మోర్బి, రాజ్‌కోట్‌ జిల్లాల్లో సైన్యం సహాయక చర్యలు కొనసాగిస్తోంది. మరో 14 ఎన్‌డీఆర్‌ఎఫ్‌, 22 ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నాయి. మరోవైపు, ఆగస్టు 30 నాటికి అల్పపీడనం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల నుంచి అరేబియా సముద్రంవైపునకు కదులుతుందని ఐఎండీ అంచనా వేసింది. అదే రోజు ఈశాన్య అరేబియా సముద్రం మీద తాత్కాలికంగా లేదా స్వల్పంగా తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.


Similar News