viral: కుమారీ ఆంటీ ఫేమస్ స్టోరీకి పూర్తిగా రివర్స్.. ఫుడ్ వ్లాగర్ కు షాకిచ్చిన హోటల్ యజమాని

ఫుడ్ వ్లాగర్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నారు.. అటువంటి నేపథ్యంలో ఓ హోటల్ యజమానిచేసిన పనికి నెటిజన్ల స్పందన ఆసక్తిగా మారింది.

Update: 2024-10-25 10:51 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వినియోగం పెరగడంతో చాలా మంది వ్లాగ్స్ చేయడం అలావాటుగా మార్చుకున్నారు. తమ అభిరుచులకు అనుగుణంగా ఎక్కడికి వెళ్లిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్స్ వల్ల ఎంతో మంది చిరు వ్యాపారులు ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో కుమారి ఆంటీ గుర్తున్నారు కదా. వ్లాగర్స్ ప్రచారంతో ఆమె తలరాతనే మారిపోయింది. ఎక్కడో రోడ్డు పక్కన స్ట్రీట్ ఫుడ్ విక్రయించుకునే కుమారి ఆంటీ ఏకంగా టీవీ షోలో అవకాశం దక్కించునేంత సెలబ్రెటీగా మారారు. ఇదంతా ఇలా ఉంటే ఓ చోట మాత్రం ఓ హోటల్ యజమాని ఫుడ్ వ్లాగర్ కు షాకిచ్చాడు. తన వద్ద మీలాంటి వారికి ఫుడ్ ఇవ్వనంటూ కరాఖండిగా చెప్పేశాడు. దీంతో ఆ యజమాని ఇచ్చిన షాక్ కు సదరు వ్లాగర్ బిత్తరపోవాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ ఈ వీడియోలో ఉన్నదాని ప్రకారం ఓ ఫుడ్ వ్లాగర్ ఓ హోటల్ కు వెళ్లాడు. అక్కడ స్ప్రింగ్ రోల్ కావాలని యజమానిని కోరగా అందుకు రూ. 60 అవుతుందని యజమాని చెప్తాడు. దాంతో ఆ డబ్బును ఇవ్వగా కూర్చోవాలని దుకాణాదారుడు వ్లాగర్ ను కోరుతాడు. నేను ఇక్కడి నుంచే వీడియో చిత్రీకరిస్తానని చెప్తాడు. దీంతో అసహనానికి గురైన యజమాని వెంటనే మీ స్ప్రింగ్ రోల్ రెడీ అంటూ పిలిచి మీరు కోరింది ఇవ్వడం కుదరదని మీ డబ్బులు మీరు తీసుకుని వెళ్లండి అంటూ ఆ డబ్బులను వ్లాగర్ చేతిలో పెట్టేస్తాడు. మరో నాలుగైదు షాపులు దాటితే మీరు అడిగింది అక్కడ ఉంటుంది అక్కడికి వెళ్లి తినండి అంటూ సలహా ఇస్తాడు. యజమాని వ్యాఖ్యలతో విస్మయం చెందిన వ్లాగర్ ఏం జరిగింది? ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రశ్నించగా మీరు వీడియో రికార్డు చేయడం గమనించానని మీరు మీ వీడియోల్లో ఇక్కడ అది బాగుంది ఇది బాగుంది అంటూ వీడియోలు చేస్తారు. ప్రస్తుతం నా రెస్టారెంట్ అద్భుతంగా ఉంది. కస్టమర్లు బాగానే ఉన్నారు. మీ లాంటి వ్లాగర్స్ నాకు అవసరం లేదంటూ బదులిచ్చాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజన్ రియాక్ట్ అవుతూ.. వ్లాగర్ స్ప్రింగ్ రోల్స్ ని ఆర్టర్ చేస్తే హోటల్ యజమాని అతడినే రోల్ చేశాడని సెటైర్ వేశాడు. మరో నెటిజన్ స్పందిస్తూ తాను దుకాణదారుడికి మద్దతు ఇస్తున్నానని కామెంట్ చేయగా.. మరో నెటిజన్ రియాక్ట్ అవుతూ ఈ ఫుడ్ వ్లాగర్స్ చాలా మంది చిన్న దుకాణాదారుల వ్యాపారాలను నాశనం చేశారని కామెంట్ చేశాడు.


Similar News