అహ్మదాబాద్: మోర్బీ వంతెన కూలిన కేసులో బాధితులకు చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని పెంచాలని ప్రైవేట్ కాంట్రాక్టర్ అజంతా ఒరెవాను గుజరాత్ హై కోర్టు ఆదేశించింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రూ. 3.5 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 50 వేలు ఇస్తామని గతంలో కాంట్రాక్టర్ తెలిపారు. అయితే దాన్ని రూ. 5 లక్షలు, రూ. 1 లక్షగా పెంచేందుకు కంపెనీ సుముఖంగా ఉందని బుధవారం ఉదయం కాంట్రాక్టర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు.
కానీ కంపెనీ ఇస్తామన్న సొమ్ముపై జస్టిస్ సోనియా గొకని, జస్టిస్ సందీప్ భట్‌లతో కూడిన ధర్మాసనం సంతృప్తి చెందలేదు. సంజయ్ గుప్త వర్సెస్ యుపీ ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఏదైనా సంఘటనకు ప్రైవేట్ పార్టీలు బాధ్యులైతే బాధితులకు 55 శాతం నష్టపరిహారం చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. దీన్ని ఆధారంగా చేసుకుని మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు ఇవ్వాలని గుజరాత్ హై కోర్టు తీర్పు చెప్పింది.
'రాష్ట్రం రూ. 8 లక్షలు చెల్లించగా.. కేంద్రం పీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 2 లక్షలు ఇచ్చింది. ఈ కేసులో కాంట్రాక్టర్ కొంత పరిహారం చెల్లించడానికి ప్రతిపాదించినట్లు మేము గుర్తించాం. కానీ, ఆ మొత్తం సరిపోవడం లేదని భావిస్తున్నాం. అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన ప్రకారంగా 55 శాతం చెల్లించాలి. కనుక చనిపోయిన వారి కుటుంబానికి రూ. 10 లక్షలు, గాయపడిన వారి కుటుంబానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని కంపెనీని ఆదేశిస్తున్నాం' అని హై కోర్టు తీర్పు చెప్పింది.