రూ.29కే కేజీ సన్నబియ్యం : ‘భారత్ రైస్’ విక్రయాలకు శ్రీకారం నేడే

దిశ, నేషనల్ బ్యూరో : దేశ ప్రజలకు బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి.

Update: 2024-02-05 18:26 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశ ప్రజలకు బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఈ కష్టకాలంలో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచేందుకు కేంద్ర సర్కారు ‘భారత్ రైస్’ తీసుకొస్తోంది. మంగళవారం (ఫిబ్రవరి 6) సాయంత్రం 4 గంటలకు ‘భారత్ రైస్’ విక్రయాలకు శ్రీకారం చుట్టనున్నారు. కేజీ భారత్ రైస్ రేటు కేవలం 29 రూపాయలే. చౌకధరకే లభించే ఈ నాణ్యమైన బియ్యం సేల్స్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఢిల్లీలోని కర్తవ్య పథ్‌ వేదికగా ప్రారంభించనున్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) నుంచి సేకరించిన 5లక్షల టన్నుల బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్‌ సమాఖ్య (నాఫెడ్) , భారత జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్సీసీఎఫ్) , కేంద్రీయ భండార్‌ విక్రయ కేంద్రాల ద్వారా తొలి విడతలో విక్రయించనున్నారు. భారత్ రైస్‌ను 5 కిలోలు, 10 కిలోల బ్యాగుల్లో అందుబాటులో ఉంచుతారు. ఇప్పటికే భారత్‌ గోధుమపిండి, పప్పుధాన్యాలను భారత్ ఆటా, భారత్ దాల్ పేరిట కిలో రూ.27.50, రూ.60 చొప్పున కేంద్ర సర్కారు విక్రయిస్తోంది. ప్రజల నుంచి వీటికి మంచి స్పందన వస్తోంది. భారత్ రైస్‌కు కూడా అదేతరహాలో ఆదరణ లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ‘‘భారత్ రైస్‌ను మొబైల్ వ్యాన్స్ ద్వారా కొనొచ్చు. మూడు కేంద్ర కోఆపరేటివ్ ఏజెన్సీలకు నేరుగా వెళ్లి కొనొచ్చు. త్వరలోనే ఈ- కామర్స్ ప్లాట్ ఫామ్స్ సహా ఇతర రిటైల్ చైన్స్‌లోనూ అందుబాటులోకి తీసుకొస్తాం. దేశంలో బియ్యం ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు చేపడుతోంది. రోజు వారీ స్టాక్ వివరాలను ట్రేడర్లు, వోల్ సేలర్స్, రిటైల్స్, బిగ్ చైన్ రిటైల్స్, ప్రాసెసర్స్, మిల్లర్లు వెల్లడించాలని ఇప్పటికే ఆదేశించాం’’ అని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ సెక్రెటరీ సంజీవ్ చోప్రా తెలిపారు. బియ్యం ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేస్తారంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. బియ్యం ధరలు అదుపులోకి వచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News