G20 Summit: జీ20 సమ్మిట్‌కు భారీగా భద్రతా.. వందలాది డ్రోన్లతో నిఘా

న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం భద్రత కోసం దాదాపు 1.30 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు.

Update: 2023-09-01 16:32 GMT

న్యూఢిల్లీ : న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబరు 9, 10 తేదీల్లో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సమావేశం భద్రత కోసం దాదాపు 1.30 లక్షల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. వీరిలో 80,000 మంది ఢిల్లీ పోలీసులు ఉంటారు. వాయుసేన, భారత సైన్యం సంయుక్తంగా వందలాది డ్రోన్లు, రాడార్లు, ఫ్రంట్‌లైన్ ఫైటర్ జెట్‌లతో దేశ రాజధాని గగనతల భద్రతను సమీక్షించనుంది. ఢిల్లీ గగనతలంపై రాఫెల్స్, మిరాజ్-2000, సుఖోయ్-30MKI యుద్ధ విమానాలను మోహరించనున్నట్లు తెలిపారు. భద్రతా ఏర్పాట్లపై అన్ని భద్రతా సంస్థలతో సమన్వయం చేసేందుకు వాయుసేన ప్రత్యేక ఆపరేషన్స్ డైరెక్షన్ సెంటర్ (ఓడీసీ)ని ఏర్పాటు చేసింది.

పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్‌లోని అన్ని వైమానిక స్థావరాలను సంసిద్ధంగా ఉంచారు. సుమారు 400 మంది అగ్నిమాపక సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్ సహా ఇతర దేశాలు బస చేయనున్న కీలక హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. వివిధ దేశాల అధినేతలకు రాకపోకల ఏర్పాట్లు చేసేందుకు రూ.18 కోట్లతో 20 బుల్లెట్ ప్రూఫ్ లిమోసిన్‌ వాహనాలను కేంద్ర సర్కారు లీజుకు తీసుకుంది. ఇక అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ తో పాటు ఆ దేశానికి చెందిన కొందరు ముఖ్యులు, పారిశ్రామిక దిగ్గజాలు దాదాపు 20 విమానాల్లో ఢిల్లీకి వస్తున్నారు.

లాక్ డౌన్ వార్తలన్నీ పుకార్లే : ఢిల్లీ పోలీసులు

జీ20 సదస్సు సందర్భంగా సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు ఢిల్లీలో మూడు రోజులు లాక్ డౌన్ విధిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఢిల్లీ పోలీసులు కొట్టిపారేశారు. అవన్నీ పుకార్లేనని తేల్చి చెప్పారు. ప్రపంచ దేశాల అధినేతలు వస్తుండటం వల్ల ఆంక్షలు మాత్రమే విధించామని, లాక్‌డౌన్‌ పెట్టామన్న వార్తల్లో నిజం లేదని ఢిల్లీ పోలీస్ పీఆర్వో సుమన్ నల్వా స్పష్టం చేశారు. జీ20 సదస్సు జరిగే కొన్ని ప్రాంతాల పరిసరాల్లోని అన్ని దుకాణాలు, ఇతరత్రా కమర్షియల్ కాంప్లెక్స్‌ని మూడు రోజుల పాటు మూసివేస్తామని చెప్పారు. ఆ ప్రాంతాల్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఐడీ కార్డ్‌లను చూపించాల్సిందేనన్నారు.

నిత్యావసరాల పంపిణీపై ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ పుకార్లను నమ్మొద్దని ఆయన కోరారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీసులు ప్రధాన వీధుల్లో ఏఐ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలను అమర్చారు. ఎవరైనా గోడలు ఎక్కడం, పరుగెత్తడం, వంగి నడవడం లాంటి సీన్ లను చూస్తే ఈ కెమెరాలు అలారంను మోగించి భద్రతా దళాలను అలర్ట్ చేస్తాయి.


Similar News