సార్వత్రిక ఎన్నికలను కవర్ చేయకుండా నిషేధించారన్న ఫ్రెంచ్ జర్నలిస్ట్
2024 ఏడాది సార్వత్రిక ఎన్నికల కవరేజ్ చేయకుండా బలవంతంగా భారత్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: సార్వత్రిక ఎన్నికలను కవర్ చేయకుండా 'భారత్‌ను విడిచి వెళ్లమని' భారత హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తనను అడిగారని ఫ్రెంచ్ జర్నలిస్ట్ సెబాస్టియన్ ఫార్సిస్ గురువారం తెలిపారు. అంతేకాకుండా 2024 ఏడాది సార్వత్రిక ఎన్నికల కవరేజ్ చేయకుండా బలవంతంగా భారత్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్, రేడియో ఫ్రాన్స్, లిబరేషన్ మరియు స్విస్ మరియు బెల్జియన్ పబ్లిక్ రేడియోలకు దక్షిణాసియా కరస్పాండెంట్‌గా నేను 13 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేస్తున్నాను. అయినప్పటికీ జూన్ 17న భారత్‌ను వదిలి వెళ్లాల్సి వచ్చిందని ఫార్సిస్ గురువారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మార్చి 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్ఏ) తన జర్నలిస్టు అనుమతిని పునరుద్ధరించడానికి నిరాకరించిందని, సాధారణ ఎన్నికలను కవర్ చేసేందుకు తిరస్కరించినట్టు తనకు చెప్పారు. ఇది తనకు అర్థంకాని సెన్సార్‌షిప్‌గా అనిపించింది. 2011 నుంచి జర్నలిస్ట్‌గా భారత్‌లో పనిచేస్తున్నాను. అవసరమైన అన్ని వీసా, అక్రిడిటేషన్‌లను తీసుకున్నాను. పైగా అనుమతి లేకుండా నిషేధిత, రక్షిత ప్రాంతాల్లో ఎప్పుడూ పనిచేయలేదు. అనేక సందర్భంగాల్లో సరిహద్దు ప్రాంతాల నుంచి రిపోర్ట్ చేసేందుకు ఎంహెచ్ఏ నాకు అనుమతులు మంజూరు చేసిందని ఫార్సిస్ వివరించారు. తాను భారతీయ మహిళను వివాహం చేసుకున్న కారణంగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తన కుటుంబం ప్రభావితం అవుతుందన్నారు. ఈ తిరస్కరణ ద్వారా విదేశీ జర్నలిస్టుల పనిపై ఆంక్షలు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ విధంగా నాలుగు నెలల్లో తిరస్కరణను ఎదుర్కొన్న రెండో జర్నలిస్టునని, గత రెండేళ్లలో కనీసం ఐదుగురు విదేశీ జర్నలిస్టులు ఇటువంటి నిషేధానికి గురయ్యారని ఫార్సిస్ వెల్లడించారు.