West Bengal: మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య కన్నుమూత

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) కన్నుమాశారు.

Update: 2024-08-08 07:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య (Buddhadeb Bhattacharjee) కన్నుమాశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆయన కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీపీఎం బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడించారు. 80ఏళ్ల భట్టాచార్య కోరిక మేరకు వైద్య పరిశోధనల కోసం ఆయన అవయవాలను దానం చేయనున్నారు. సీపీఎం ప్రధాన కార్యాలయంలో అనుచరులు నివాళులర్పించేలా భౌతికగాయాన్ని ఉంచనున్నారు. శుక్రవారం అంతిమయాత్ర జరగనుంది.

11ఏళ్ల బెంగాల్ సీఎంగా..

భట్టాచార్య 2000-2011 వరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్‌ ఉన్నారు. సీపీఎంలో నిర్ణయాధికార విభాగం పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. 34 ఏళ్ల కమ్యూనిస్టు పాలనకు ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చెక్ పెట్టింది. అప్పట్నుంచి భట్టాచార్య రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

1977లో తొలిసారిగా ఎమ్మెల్యేగా..

బుద్ధదేవ్‌ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్‌ పూర్వ విద్యార్థి. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1977లో తొలిసారి కాశిపుర్‌-బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజకీయంగా అంచలంచెలుగా ఎదిగారు. జ్యోతి బసు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2001, 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయన అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. బాలీగంజ్‌లోని రెండుపడక గదుల చిన్న ఇంట్లోనే నివసించేవారు. సీఎంగానూ అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు. ఇప్పుడు అక్కడే తుదిశ్వాస విడిచారు.

ప్రముఖుల సంతాపం

భట్టాచార్య మృతిపట్ల బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. వామపక్ష నేతతో తనకు దశాబ్దాల అనుబంధం ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రకటించారు. బీజేపీ నేత సువేందు అధికారి భట్టాచార్య మృతి పట్ల సంతాపం తెలిపారు. భట్టాచార్య మృతిపట్ల సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం తెలిపారు. పార్టీ పట్ల ఆయన అంకితభావం గొప్పదని కొనియాడారు.


Similar News