రాజకీయాలకు వీడ్కోలు పలికిన మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

18 ఏళ్ల ప్రజాసేవ, రాజకీయాల నుంచి విరమిస్తున్నట్టు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు.

Update: 2024-06-09 14:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ మాజీ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. తన 18 ఏళ్ల ప్రజాసేవ, రాజకీయాల నుంచి విరమిస్తున్నట్టు ఆదివారం ప్రకటనలో వెల్లడించారు. రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ పార్టీ కోసం పని చేస్తూనే ఉంటానని ఆయన ఎక్స్‌లో ట్వీట్ చేశారు. 'ఈరోజు నా 18 సంవత్సరాల ప్రజా సేవకు తెరపడింది. అందులో మూడేళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోడీ రెండవ టరంలో బాధ్యతలు చేపట్టే అవకాశం వచ్చింది. 18 ఏళ్ల ప్రజాసేవకు ఇంతటితో ముగించాలని ఖచ్చితంగా అనుకోలేదు. కానీ ఈ ఎన్నికల ఓటమితో అలా జరిగిపోయింది ' అని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నా రాజకీయ జీవితంలో కలిసిన వారికి, నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కార్యకర్తలు, నేతలకు కృతజ్ఞతలు. భవిష్యత్తులో బీజేపీ కార్యకర్తగా పార్టీకి మద్దతిస్తూ, పని చేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని తిరవనంతపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాజీవ్ చంద్రశేఖర్ కాంగ్రెస్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన శశి థరూర్‌ను ఓడించడంలో విఫలమయ్యారు. రాజీవ్ చంద్రశేఖర్‌పై శశిథరూర్ 16,077 ఓట్ల తేడాతో గెలుపొందారు. 


Similar News