అసోంలో వరద బీభత్సం..మరో ఏడుగురు మృతి

అసోంలో వరదల బీభత్సం కానసాగుతూనే ఉంది. ప్రధాన నదులు, వాటి ఉపనదులు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. అయితే మంగళవారం నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టినా వివిధ ఘటనల్లో మరో ఏడుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు.

Update: 2024-07-09 18:50 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అసోంలో వరదల బీభత్సం కానసాగుతూనే ఉంది. ప్రధాన నదులు, వాటి ఉపనదులు పొంగి పొర్లుతూనే ఉన్నాయి. అయితే మంగళవారం నీటి మట్టం కాస్త తగ్గుముఖం పట్టినా వివిధ ఘటనల్లో మరో ఏడుగురు మరణించినట్టు అధికారులు తెలిపారు. అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రకారం.. కాచర్‌లో ఇద్దరు, ధుబ్రి, ధేమాజీ, సౌత్ సల్మారా, నాగావ్, శివసాగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 92కి చేరింది. ఇందులో కేవలం వరదల ప్రభావంతోనే 79 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం నాటికి 49,014.06 హెక్టార్లకు గాను 38,870.3 హెక్టార్లలో పంటలు ముంపునకు గురయ్యాయి. మొత్తం 48,021 మంది బాధితులు 507 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాల్లో 94 రోడ్లు, మూడు వంతెనలు, 26 ఇళ్లు, ఆరు కట్టలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో వరద పరిస్థితి స్వల్పంగా మెరుగుపడినప్పటికీ, బ్రహ్మపుత్ర దాని ఉపనదులు చాలా చోట్ల ప్రమాద స్థాయి కంటే దిగువన ప్రవహిస్తున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Similar News