అమర్‌నాథ్‌లో పూర్తయిన తొలిపూజ.. జూన్ 29 నుంచి తీర్థయాత్ర స్టార్ట్

హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అమర్‌నాథ్‌లో శనివారం ఉదయం అర్చకులు తొలిపూజను నిర్వహించారు.

Update: 2024-06-22 07:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో:హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం అయిన అమర్‌నాథ్‌లో శనివారం ఉదయం అర్చకులు తొలిపూజను నిర్వహించారు.దీంతో ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు నాంది పలికారు. భక్తులు జూన్ 29 నుంచి అమర్‌నాథ్‌ని సందర్శించవచ్చు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్‌లోని రాజ్ భవన్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పూజలో పాల్గొన్నారు. పూజ తర్వాత మాట్లాడిన ఆయన, దేశవ్యాప్తంగా భక్తులు పవిత్ర పుణ్యక్షేత్రాన్ని సందర్శించడానికి చాలా ఆసక్తితో ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.

తీర్థయాత్ర అధికారికంగా ప్రారంభం కావడానికి ముందు భద్రతా దళాలు యాత్ర మార్గంలో పూర్తి స్థాయిలో కుంబింగ్ నిర్వహించాయి. ఉగ్రవాదులు ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్‌లో దాడులు చేస్తున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు వచ్చే వారిపై కూడా దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో యాత్ర మార్గం మొత్తం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు నిరంతరం పహారా కాస్తున్నాయి.

జమ్మూ అదనపు డైరెక్టర్ జనరల్ (ADGP) ఆనంద్ జైన్ మాట్లాడుతూ, భక్తులు ప్రశాంతంగా, విజయవంతంగా తీర్థయాత్రను పూర్తి చేయడానికి వారి భద్రత కోసం ఏర్పాట్లు చేశామని, వాటిని నిరంతరం సమీక్షిస్తున్నామని అన్నారు. అమర్‌నాథ్ యాత్రలో గుహకు చేరుకోవడం ఒక సవాలుగా ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు శివుని ప్రార్ధనలు చేయడానికి ఆలయాన్ని సందర్శిస్తారు. గతేడాది 4.5 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు. ఈ ప్రాంతంలో తరచూ ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా దళాలను అధికంగా మోహరిస్తున్నారు. తీర్థయాత్ర జూన్ 29న ప్రారంభమై ఆగస్టు 19న ముగుస్తుంది.


Similar News