గురుగ్రామ్ ఫైర్‌బాల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి
హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది.
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానాలోని గురుగ్రామ్‌లో ఒక ఫ్యాక్టరీలో శుక్రవారం అర్ధరాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, మరికొందరికి గాయాలు అయ్యాయి, ప్రస్తుతం వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురుగ్రామ్-ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని దౌల్తాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫైర్‌బాల్ తయారీ కర్మాగారంలో రాత్రి 2 గంటల సమయంలో పేలుడు సంభవించగా, దాని ధాటికి ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న భవనాలు దెబ్బతిన్నాయి. పేలుడుతో మంటలు చెలరేగి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ, దగ్గరలోని అగ్నిమాపక కేంద్రాల నుండి 24 ఫైర్ ఇంజన్లను తీసుకువచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించాం. మేము ఇక్కడికి చేరుకునే లోపు ఇద్దరు చనిపోయారు. ముగ్గురు-నలుగురు తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారని తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా బాయిలర్ పేలి మంటలు చెలరేగాయని సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.