CBI : జూనియర్ వైద్యురాలి మృతదేహంపై వేలి ముద్రలు.. అవి ఎవరివి ?

దిశ, నేషనల్ బ్యూరో: సీబీఐ దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ‌లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించిన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.

Update: 2024-08-23 15:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సీబీఐ దర్యాప్తు జరుగుతున్న కొద్దీ కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ‌లో జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనకు సంబంధించిన విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. దురాగతానికి బలైన జూనియర్ డాక్టర్ శరీరంపై రెండు వేర్వేరు వేలిముద్రలను సీబీఐ టీమ్ గుర్తించింది. అవి మెడికల్ కాలేజీకే చెందిన ఇద్దరు డాక్టర్లవి అని వెల్లడైంది. ఈనేపథ్యంలో ఆ ఇద్దరు డాక్టర్లతో పాటు మరో ఇద్దరు వైద్యులను సీబీఐ ప్రశ్నించగా.. తాము ఆ దారుణంలో భాగస్తులం కాదని వారు స్పష్టం చేసినట్లు సమాచారం. ఒకవేళ వారు హత్యలో భాగం కాకపోయి ఉంటే.. హత్యాచారం జరిగిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేశారా? అనే కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

దురాగతం జరగడానికి కొన్ని గంటల ముందు..

జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న తెల్లవారుజామున మెడికల్ కాలేజీ సెమినార్ హాల్‌లో హత్యాచారం జరిగింది. ఇది జరగడానికి కొన్ని గంటల ముందు ఆస్పత్రిలో వైద్యుల కదలికలకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ సీబీఐ వద్ద ఉంది. దాని ఆధారంగా సీబీఐ అడిగిన ప్రశ్నలకు ఆ నలుగురు డాక్టర్లు పొంతనలేని సమాధానాలు చెప్పారు. ఇందువల్లే ఇద్దరు మొదటి సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలు, ఒక హౌస్ సర్జన్, ఒక ఇంటర్న్‌లకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించాలని సీబీఐ భావిస్తోందట. ఈ నలుగురు వైద్యుల్లో ఒకరు ఆగస్టు 9న ఉదయం 9.30 గంటలకు సెమినార్ హాలులోకి వెళ్లి జూనియర్ వైద్యురాలి మృతదేహాన్ని చూసి వచ్చి అధికారులకు సమాచారం అందించారు.

హౌస్ సర్జన్ ఆ టైంలో..

ఆగస్టు 9న తెల్లవారుజామున 3.30 గంటల తర్వాతే సెమినార్ హాలులో హత్యాచార ఘటన జరిగింది. అయితే తెల్లవారుజామున 2.45 గంటలకు కాలేజీకి చెందిన ఒక హౌస్ సర్జన్ సెమినార్ హాల్ వైపు వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈవిషయాన్ని సదరు హౌస్ సర్జన్ విచారణలో అంగీకరించాడు. ఇక సీబీఐ ఇంటరాగేషన్‌ను ఎదుర్కొంటున్న మెడికల్ కాలేజీ ఇంటర్న్ డాక్టర్ ఆ సమయంలో ఆస్పత్రిలోని మూడో అంతస్తులో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఆగస్టు 8న రాత్రి జూనియర్ వైద్యురాలితో చివరిసారిగా ఫోనులో మాట్లాడిన వారిలో ఈ ఇంటర్న్ కూడా ఉన్నారని తెలిసింది.

సంజయ్‌రాయ్‌కు జ్యుడీషియల్‌ రిమాండ్‌

ఈ కేసులో నిందితుడు సంజయ్‌రాయ్‌కు కోర్టు 14రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. సీబీఐ కస్టడీ శుక్రవారంతో ముగియడంతో నిందితున్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ సీల్దా కోర్టులో హాజరుపరిచారు. దీంతో, కోర్టు నిందితుడ్ని 14 రోజుల రిమాండ్ కు పంపింది. కోర్టు ఆదేశాల అనంతరం పోలీసులు అతడిని జైలుకు తరలించారు. 


Similar News