భారత్‌కు ఫిజీ ఉప ప్రధాని: అయోధ్యను సందర్శించనున్న మొదటి విదేశీ నేత

ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న ఆయనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పరిమిత త్రిపాఠి స్వాగతం పలికారు.

Update: 2024-02-05 03:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఫిజీ దేశ ఉప ప్రధాని బిమన్ ప్రసాద్ వారం రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. ఆదివారం అర్ధరాత్రి న్యూఢిల్లీకి చేరుకున్న ఆయనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పరిమిత త్రిపాఠి స్వాగతం పలికారు. బిమన్ ఈనెల 10వరకు ఇండియాలో పర్యటిస్తారు. సోమవారం భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌, విదేశీ వ్యవహారాలు, విద్యా శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్‌తో బిమన్ భేటీ కానున్నారు. ఈ నెల 8న అయోధ్యను సందర్శిస్తారు. అయితే జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ వేడుక తర్వాత అయోధ్యను సందర్శించనున్న మొదటి విదేశీ నాయకుడు ప్రసాదే కావడం గమనార్హం. బిమన్ రాక సందర్భంగా విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అధికారిక పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన ఫిజీ డిప్యూటీ పీఎంకు ఘన స్వాగతం. ఇది భారత్-ఫిజీ సంబంధాలను పురోగమిస్తుంది’ అని పేర్కొన్నారు. ఫిజీ ఆర్థిక, వ్యూహాత్మక ప్రణాళిక, జాతీయ అభివృద్ధి, గణాంకాల మంత్రిగా కూడా పనిచేస్తున్న బిమన్ ప్రసాద్ 2023 ఫిబ్రవరిలోనూ భారతదేశాన్ని సందర్శించారు. ఇది ఆయన మొదటి అధికారిక పర్యటన. అప్పటి పర్యటనలో ‘'సుస్థిరమైన, డీకార్బనైజ్డ్ భవిష్యత్ కోసం వ్యూహాలు’ అనే అంశంపై జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థికంగా సాధ్యమయ్యే శక్తి పరివర్తనను సులభతరం చేయడానికి సులువైన సాంకేతిక బదిలీకి మద్దతు తెలపాలని అభివృద్ధి చెందిన దేశాలకు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News