PM Modi : ఔరంగజేబ్‌‌ను పొగిడేవాళ్లతో మహారాష్ట్రకు ఏం పని ?

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని విపక్ష పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు.

Update: 2024-11-14 12:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలోని విపక్ష పార్టీలపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫైర్ అయ్యారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్(Sambhaji Maharaj) పేరును కూడా ఆ పార్టీలు ఇబ్బందిగా భావిస్తున్నాయని ధ్వజమెత్తారు. గురువారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ(PM Modi) ఈ వ్యాఖ్యలు చేశారు. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే కోరికను నెరవేర్చేందుకే ఔరంగాబాద్‌ పేరును ఛత్రపతి శంభాజీనగర్‌‌గా మార్చామన్నారు. ‘‘శంభాజీ మహరాజ్‌ను హత్య చేసిన వ్యక్తిని(Aurangzeb) కొన్ని విపక్ష పార్టీలు మహా పురుషుడిగా భావిస్తున్నాయి. ఈ విధమైన వైఖరిని తీసుకోవడం అంటే మరాఠాల గౌరవానికి భంగం కలిగించినట్టే కదా ? వారి వైఖరి మరాఠాల ఉనికికి వ్యతిరేకంగా లేదా ? దీన్ని మహారాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారా ?’’ అని ప్రధాని మోడీ ప్రశ్నించారు.

‘‘ఈ ఎన్నికల్లో ఒక వైపు శంభాజీ మహరాజ్‌ను అనుసరించే వారు ఉన్నారు. మరోవైపు ఔరంగజేబ్‌ గురించి గొప్పగా చెప్పేవారు ఉన్నారు. ఏ పక్షాన ఉండాలో మీరే తేల్చుకోండి’’ అని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ రిజర్వేషన్లకు వ్యతిరేకమేనని మోడీ విమర్శించారు. గత పదేళ్లుగా దేశ ప్రధానమంత్రి పదవిలో ఒక ఓబీసీ బిడ్డ ఉండటాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక పోతోందన్నారు. ‘‘ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలను నమ్ముకుంటుంది. అభివృద్ధి రాజకీయాలను ఆ పార్టీ అనుసరించదు’’ అని మోడీ ధ్వజమెత్తారు. ఆర్టికల్ 370ని పునరుద్ధరించి, జమ్మూకశ్మీరుకు ప్రత్యేక రాజ్యాంగాన్ని అమల్లోకి తేవాలని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కోరుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు.

Tags:    

Similar News