Farmer leader: దల్లేవాల్‌ను ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం.. రైతు సంఘం నేత అభిమన్యు
పంజాబ్-హర్యానా బార్డర్‌లోని ఖనౌరీ సరిహద్దులో రైతు సంఘం నాయకుడు దల్లేవాల్ ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: పంజాబ్-హర్యానా (Panjab-Haryana) బార్డర్‌లోని ఖనౌరీ ( Khanauri ) సరిహద్దులో రైతు సంఘం నాయకుడు దల్లేవాల్ (Dallewal) ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం నాటికి ఇది 34వ రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో నిరాహార దీక్ష చేస్తున్న దల్లేవాల్‌ను ప్రభుత్వం బలవంతంగా అక్కడి నుంచి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని రైతు సంఘం నేత అభిమన్యు కోహర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ఆందోళనను మొదటి రోజు నుంచి అణచి వేసేందుకే కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
చట్టబద్ధంగా హామీ ఇవ్వబడిన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) సహా తమ డిమాండ్లపై నిరసన తెలుపుతున్న రైతులతో ప్రభుత్వం వెంటనే చర్చలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. గాంధీ సిద్ధాంతాలను అవలంభిస్తూ నిరసనను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఏ సమయంలోనైనా దల్లేవాల్‌ను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు పెద్ద సంఖ్యలో ఖనౌరీ సరిహద్దుకు చేరుకోవలని పిలుపునిచ్చారు. దల్లేవాల్‌ను బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నంలో ఎటువంటి పరిణామాలు ఎదురైనా కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.