Engineer Rashid: కశ్మీర్ ప్రజలను ఎవరూ అణచివేయలేరు.. ఎంపీ ఇంజనీర్ రషీద్

బారాముల్లా ఎంపీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ చీఫ్ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-12 09:52 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యంతర బెయిల్ పై విడుదలైన జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ, అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ) చీఫ్ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో కశ్మీర్ ప్రజల కంటే ఎవరికీ శాంతి అవసరం లేదని తెలిపారు. అది ప్రధాని మోడీ ఇచ్చే శాంతి కాదని, షరతులు లేకుండా గౌరద ప్రదంగా ఉండాలన్నారు. గురువారం ఆయన శ్రీ నగర్‌లో మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ ప్రజలు ఏ మాత్రం బలహీనులు కాదని నిరంతరం పోరాడుతూనే ఉంటారని చెప్పారు. ‘కశ్మీర్ ప్రజలు సత్య మార్గంలో నడుస్తున్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదు. ఆ నిర్ణయాన్ని కశ్మీర్ ప్రజలెవరూ స్వాగతించలేదు. ఎంతమందిని జైలుకు పంపినా చివరికి విజయం సాధిస్తాం’ అని వ్యాఖ్యానించారు. తమ గొంతును ఎవరూ అణచివేయలేరని నొక్కి చెప్పారు. కశ్మీర్ ప్రజలను మనుషుల్లా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికైనా కశ్మీర్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 


Similar News