Engineer Rashid: ఎంపీ ఇంజనీర్ రషీద్‌కు మధ్యంతర బెయిల్.. పాటియాలా హౌస్ కోర్టు నిర్ణయం

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్‌కు పాటియాలా హౌస్ కోర్టు అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-09-10 12:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా ఎంపీ షేక్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్‌కు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం రషీద్ మూడు నెలల మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆగస్టు 27న తీర్పును రిజర్వులో ఉంచింది. తాజాగా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆయన బయటకు వచ్చి కశ్మీర్‌లో ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది. రషీద్ నేతృత్వంలోని అవామీ ఇత్తెహాద్ పార్టీ తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అక్టోబర్ 2 తర్వాత ఆయన ఎన్ఐఏ ఎదుట లొంగిపోవాల్సి ఉంటుంది.

కాగా, కశ్మీర్‌లోని ఉగ్రవాద గ్రూపులు, వేర్పాటువాదులకు నిధులు సమకూరుస్తున్నారనే ఆరోపణలపై రషీద్‌ను 2017లో ఉపా చట్టం కింద ఎన్ఐఏ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో జైలులో ఉండగానే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు జూలైలో ప్రమాణ స్వీకారం కోసం రషీద్‌కు 2 గంటల పెరోల్ ఇచ్చారు. దీంతో ఆయన ఎంపీగా ప్రమాణం చేశారు. 


Similar News