జమ్మూ కశ్మీర్‌లో ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదులు, ఓ సైనికుడు మృతి

జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని మోడెర్‌గామ్, ఫ్రీసాల్ చిన్నిగాం గ్రామాల్లో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు, ఒక సైనికుడు మరణించారు.

Update: 2024-07-06 17:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌ కుల్గాం జిల్లాలోని మోడెర్‌గామ్, ఫ్రీసాల్ చిన్నిగాం గ్రామాల్లో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు, ఒక సైనికుడు మరణించారు. టెర్రరిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు మోదర్‌గామ్ గ్రామంలో భద్రతా బలగాలు శనివారం ఉదయం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురుకాల్పులు జరగగా.. ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి మరణించాడు. అనంతరం ఫ్రీసల్ గ్రామంలోనూ లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు వేగంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. జవాన్లు గ్రామానికి చేరుకున్న వెంటనే, ఒక ఇంట్లో దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగపడ్డారు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ వివరాలను కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ వేదికగా వెల్లడించారు. టెర్రరిస్టుల ఆచూకీ కోసం రెండు ప్రాంతాల్లో ఆపరేషన్ చేపట్టినట్టు తెలిపారు.


Similar News