ఈవీఎం మెషీన్లు హ్యాక్ చేయొచ్చు.. ఇండియా ఓటింగ్ యంత్రాలపై ఎలన్ మస్క్ ఆసక్తికర ట్వీట్
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలను వినియోగించవద్దని ప్రముఖ వ్యాపార దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ అన్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్విట్టర్ వేదిక పేర్కొన్నారు. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ సమీప బంధువు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై పలు ఆరోపణలు చేశారు. ఇటీవల ప్యూర్టోరికోలో నిర్వహించిన ప్రైమరీ ఎన్నికల్లో ఈవీఎంల అవకతవకలు చోటు చేసుకొన్నాయని తెలిపారు. పేపర్ ట్రయల్ ఉంది కాబట్టి సమస్యను గుర్తించగలిగామని, లేదంటే ఏం జరిగేదో.. ఈ సమస్యలను నివారించడానికి పేపర్ బ్యాలెట్‌లను తిరిగి తీసుకురావాలన్నారు. అలా చేస్తే ప్రతి ఓటు లెక్కించే అవకాశం ఉంటుందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై ఎలన్ మస్క్ స్పందించారు. ‘మనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తొలగించాలి. వీటిని వ్యక్తులు లేదా ఏఐ సాయంతో హ్యాక్ చేసే ప్రమాదం ఉంది. ఇది దేశానికి నష్టాన్ని కలిగిస్తుంది’ అని మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఈ వ్యవహారంపై బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ ఎలన్ మస్క్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. కానీ భారతీయ ఈవీఎంలు సురక్షితమైనవి, భారత ఈవీఎంలు అలా డిజైన్ చేయబడ్డాయని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై కూడా ఎలన్ మస్క్ స్పందించారు. ఏదైనా హ్యాక్ చేయవచ్చని ఎలన్ సమాధానం ఇచ్చారు.