Elections: 48 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు బై పోల్స్.. వయనాడ్‌లో ఎప్పుడంటే?

మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న, జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.

Update: 2024-10-15 11:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనుండగా, జార్ఖండ్‌లో రెండు దశల్లో నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ మంగళవారం ఢిల్లీలో ఎలక్షన్ షెడ్యూల్‌ను ప్రకటించారు. రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కూడా వెల్లడించారు. దీంతో దేశంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంది.

ఒకే దశలో ‘మహా’ పోల్స్

288 మంది శాసనసభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 26తో ముగియనుంది. ఈ కాలపరిమితి ముగియడానికన్నా ముందే ఎన్నికలు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మహారాష్ట్రలో అక్టోబర్ 22న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే నెల 29 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 4 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్ 20న ఒకే దశలో అన్ని స్థానాలకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 9.63కోట్ల మంది ఓటర్లున్నారని ఈసీ వెల్లడించింది. 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 20.93లక్షల మంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో 1,00,186 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.

రెండు దశల్లో జార్ఖండ్ పోలింగ్

జార్ఖండ్ అసెంబ్లీ పదవీకాలం 2025 జనవరి 5తో ముగియనుంది. ఈ రాష్ట్రంలో 81 అసెంబ్లీ స్థానాలకు గాను రెండు దశల్లో ఎన్నికలు జరగనుండగా.. మొదటి ఫేస్‌కు అక్టోబర్ 18న నోటిఫికేషన్ వెలువడనుండగా అక్టోబర్ 25వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నవంబర్ 13న తొలి దశ పోలింగ్ జరగనుంది. ఇక, రెండో దశకు అక్టోబర్ 22న నోటిఫికేషన్ రిలీజ్ కానుండగా..నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. రెండు దశల ఎన్నికల ఫలితాలు నవంబర్ 23నే విడుదల కానున్నాయి. రాష్ట్రంలో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వీరిలో 1.29 కోట్ల మంది మహిళలు, 1.31 కోట్ల మంది పురుషులు ఉన్నారు.

48 అసెంబ్లీ, రెండు లోక్ సభ స్థానాలకు బై పోల్స్

దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 48 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సైతం ఉపఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. వీటికి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 13న 47 అసెంబ్లీ స్థానాలతో పాటు కేరళలోని వయనాడ్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోలింగ్ జరగనుంది. అలాగే నాందేడ్ లోక్ సభ సెగ్మెంట్, మరొక అసెంబ్లీ స్థానానికి నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. కాగా, 48 అసెంబ్లీ స్థానాల్లో 42 మంది ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందడంతో ఈ స్థానాలు ఖాళీ అయ్యాయి. అలాగే రాహుల్ గాంధీ రాజీనామాతో కేరళలోని వయనాడ్, కాంగ్రెస్ ఎంపీ మరణంతో మహారాష్ట్రలోని నాందేడ్ పార్లమెంటు నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు వచ్చాయి.

రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర ఉత్కంఠ

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలపై ఎన్నడూ లేనంత ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలే అందుకు కారణం. గత ఏడాదిన్నర కాలంగా రాజకీయ సంచలనాలకు మహారాష్ట్ర కేంద్రంగా మారింది. ఏకంగా రెండు ప్రాంతీయ పార్టీలు రెండుగా చీలిపోయాయి. శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీలు రెండుగా విడిపోయి వర్గాలుగా మారాయి. ఈ పరిణామాల అనంతరం తొలిసారి లోక్ సభ ఎన్నికలు జరగగా శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ) పార్టీలు కాస్త ఆశించిన మేర ఫలితాలు సాధించాయి. దీంతో ప్రజలు ఎవరికి పట్టం కడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక, జార్ఖండ్‌లోనూ ఇటీవల అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుత సీఎం హేమంత్ సోరెన్ మనీలాండ్‌రింగ్ కేసులో జైలుకు వెళ్లగా తన పదవికి రిజైన్ చేశారు. ఈ క్రమంలోనే చంపయీ సోరెన్ సీఎం కాగా.. అనంతరం హేమంత్ బెయిల్‌పై విడుదలయ్యాక మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం చంపయీ జేఎంఎంకు రిజైన్ చేసి బీజేపీలో చేరారు. దీంతో ఈ రాష్ట్రంలోనూ ప్రజా తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. 


Similar News