Election Results-2024: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ
ఎగ్జిట్ పోల్స్ (Exit Polls)ను తారుమారు చేస్తూ హర్యానాలో మరోసారి బీజేపీ (BJP) హ్యట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఎగ్జిట్ పోల్స్ (Exit Polls)ను తారుమారు చేస్తూ హర్యానాలో మరోసారి బీజేపీ (BJP) హ్యట్రిక్ దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా, జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు మునుపటి జోరునే కొనసాగించారు. రాష్ట్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ (BJP) ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని ఇటీవలే జోరుగా మీడియాలో వార్తలు వచ్చాయి. ఖచ్చితంగా అక్కడ ఈ సారి కాంగ్రెస్ పార్టీ (Congress Party)యే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని వివిధ రకాల సంస్థలు ఎగ్జిట్ పోల్స్ (Exit Polls)ను విడుదల చేశాయి.
కానీ, అందరి అంచనాలను తారుమారు చేస్తూ మరోసారి బీజేపీ హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్థానాలు అవసరం అవుతాయి. అయితే, ప్రస్తుతం అక్కడ బీజేపీ 50 స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ 34 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇతరులు 5 స్థానాల్లో లీడ్‌లో ఉండగా.. ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థులు 1 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. దీంతో దాదాపు బీజేపీ విజయం ఖాయం అయిపోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక హర్యానా (Haryana), జమ్ము కశ్మీర్ (Jammu & Kashmir) అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) కి జనం ఊహించని షాక్ ఇచ్చారు. రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే బరిలోకి దిగిన ఆ పార్టీ ఎక్కడా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. త్వరలోనే ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఉండటంతో హర్యానా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఆ ఎన్నికలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం కూడా లేకపోలేదు. ఒకవేళ హర్యానాలో కాంగ్రెస్ జత కట్టి ఉంటే సునాయసంగా విజయం సాధించే అవకాశం ఉండేదని పొలిటికల్ అనలిస్ట్‌లు అంటున్నారు.