సీఎం సలహాదారు నివాసంలో ఈడీ సోదాలు..

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛత్తీస్‌గఢ్‌లో రైడ్స్ చేసింది.

Update: 2023-08-23 10:47 GMT

రాయపూర్: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఛత్తీస్‌గఢ్‌లో రైడ్స్ చేసింది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘెల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మ, రాయ్‌పూర్‌లోని ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) నివాసాలలో సోదాలు చేసింది. బుధవారం ఉదయం దేవేంద్ర నగర్‌లోని ఆఫీసర్స్ కాలనీలో ఉంటున్న వినోద్ వర్మ ఇంటి చుట్టూ పారామిలటరీ సిబ్బందిని మోహరించి మరీ తనిఖీలు నిర్వహించారు. దుర్గ్‌లోని ఓ వ్యాపారవేత్త నివాసంలోనూ ఈడీ టీమ్ సోదాలు జరిపింది. ఛత్తీస్‌గఢ్‌కు సంబంధించి బొగ్గు కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, డిల్లా మినరల్ ఫౌండేషన్ ఫండ్‌లో అవకతవకలు, ఆన్ లైట్ బెట్టింగ్ అప్లికేషన్ వంటి వివిధ కేసులను ఈడీ విచారిస్తోంది.

గత రెండు రోజులుగా, ఆన్‌లైన్ బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించి రాయపూర్, దుర్గ్‌లలో ఈడీ గాలింపు చర్యలు జరుపుతోంది. వాటికి కొనసాగింపుగానే ఈ సోదాలు జరిగినట్టు తెలుస్తోంది. దీనిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ఘాటుగా స్పందించారు. ''నా పుట్టినరోజున నా రాజకీయ సలహాదారు, ఓఎస్‌డీ, సన్నిహితుల నివాసాలకు ఈడీని పంపడం ద్వారా విలువైన కానుకలు ఇచ్చిన ప్రధానమంత్రి మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు చాలాచాలా ధన్యవాదాలు" అని పేర్కొంటూ భూపేష్ బఘెల్ ట్వీట్ చేశారు.


Similar News