Quad Meet: క్వాడ్ సమావేశం కోసం జపాన్ వెళ్లనున్న విదేశాంగ మంత్రి జైశంకర్

ఇప్పటివరకు నెరవేర్చిన అంశాలను సమీక్షిస్తారని ఆయన అన్నారు

Update: 2024-07-25 17:30 GMT

దిశ, నేషనల్ బ్యూరో: క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ జూలై 29న జపాన్‌కు వెళ్లనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం మీడియా సమావేశంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు. నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు క్వాడ్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లనున్నారని, ఇప్పటివరకు నెరవేర్చిన అంశాలను సమీక్షిస్తారని ఆయన అన్నారు. సముద్ర తీర ప్రాంత భద్రత, వాతావరణ మార్పుల ముప్పు, ఈ ప్రాంతంలో పెట్టుబడులు, టెక్నాలజీ ఆవిష్కరణలు సహా పలు అంశాలపై సమావేశంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమావేశంలోనే తదుపరి క్వాడ్ సమ్మిట్ తేదీపై కూడా చర్చించవచ్చన్నారు. దీనిపై క్వాడ్ భాగస్వాములందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారన్నారు. ఇదే సమయంలో నెలాఖరున జరగనున్న ఇరాన్ కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరపున ఎవరు హాజరవుతారనే దానిపై మరో రెండు రోజుల్లో వివరాలు వెళ్లడించనున్నట్టు రణధీర్ జైశ్వాల్ స్పష్టం చేశారు. కాగా, క్వాడ్ అనేది భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాల మధ్య దౌత్య భాగస్వామ్యం కోసం ఏర్పడిన కూటమి. ఈ దేశాలు హిందూ మహాసముద్ర తీర దేశాలకు మానవతా సాయం, విపత్తు సాయం అందించడం కోసం పనిచేస్తున్నాయి.  

Tags:    

Similar News