బీహార్‌లో వరదలు.. ముజఫర్‌పూర్ జిల్లాలో నీటమునిగిన ఇళ్లు, పాఠశాలలు

బీహార్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి

Update: 2024-07-14 10:04 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీహార్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అక్కడి నదుల్లో నీటి ప్రవాహం భారీగా పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి. ముఖ్యంగా బాగ్‌మతి నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో ముజఫర్‌పూర్ జిల్లాలోని 18 పంచాయతీలలో వందలాది ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ఆయా పంచాయతీల్లోని లక్షలాది మంది ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. క్షణం క్షణం నీటి ప్రవాహం పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ఇళ్లపైకి చేరుతున్నారు.

ప్రభావిత ప్రాంతాల్లోని అనేక పాఠశాలలు వరదనీటిలో మునిగిపోవడంతో వందలాది మంది చిన్నారుల చదువుకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నీటి మట్టం మోకాలి ఎత్తు వరకు చేరడంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అక్కడి పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. బర్రి, బస్‌ఘట్ట పంచాయతీల్లోని వందలాది ఇళ్లలోకి నీరు చేరింది. గంగియా నుండి బకుచి చౌక్ వరకు విస్తరించి ఉన్న మాజీ పశ్చిమ బాగ్మతి నది కరకట్ట కొంత తెగిపోయింది.

విపత్తు నిర్వహణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి వరద ప్రభావిత జిల్లాల అధికారులతో వర్చువల్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి పరిస్థితులపై అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి రోజులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, వివిధ నదుల నీటిమట్టాలు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని బీహార్ ప్రభుత్వం జిల్లా యంత్రాంగాలను ఆదేశించింది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Tags:    

Similar News