ఈ తేదీల్లో ఆ విమానాల్లో ప్రయాణించొద్దు : ప్రయాణికులకు పన్నూ హెచ్చరిక

నవంబర్ 1 నుంచి 19 తేదీల మధ్య ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని ఖలిస్థానీ ఉగ్రవాది పన్ను హెచ్చరించాడు.

Update: 2024-10-21 06:13 GMT

దిశ, వెబ్ డెస్క్: వారంరోజుల్లో కొన్ని విమానాలకు 100కు పైగా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ (Gurpatwant Singh Pannun) ప్రయాణికులను హెచ్చరిస్తూ కీలక ప్రకటన చేశాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ ఫౌండర్ గా ఉన్న పన్నూ.. నవంబర్ 1 నుంచి 19 తేదీల మధ్య ఎయిర్ ఇండియా (Air India Flights) విమానాల్లో ప్రయాణించవద్దని హెచ్చరించాడు. సిక్కు 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆయా తేదీల్లో ఎయిర్ ఇండియాకు చెందిన విమానాలపై దాడి జరగవచ్చని, ఇది మారణహోమం కావొచ్చని తెలిపాడు. గతేడాది కూడా పన్నూ ఇలాంటి హెచ్చరికే చేశాడు.

ఇప్పటి వరకూ విస్తారా, ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, స్పైస్ జెట్ వంటి విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తాజాగా పన్నూ చేసిన హెచ్చరిక మళ్లీ కలకలం రేపింది. గతేడాది నవంబర్ లో కూడా పన్నూ ఇలాంటి హెచ్చరిక చేస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అతనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల కింద కేసు నమోదు చేసింది. గతేడాది డిసెంబర్లో తనను హతమార్చేందుకు కుట్ర జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు.. ఈ ఏడాది జనవరి 26న పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్‌లను చంపేస్తానని బెదిరించాడు. గ్యాంగ్ స్టర్లంతా పంజాబ్ సీఎంపై దాడి చేయాలని పిలుపునిచ్చాడు. 


Similar News