డీఎంకే కుటుంబ సంస్థగా మారింది: ప్రధాని మోడీ విమర్శలు
తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) చేస్తున్న కుటుంబ రాజకీయాల వల్ల యువత ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని ప్రధాని మోడీ విమర్శించారు.
దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) చేస్తున్న కుటుంబ రాజకీయాల వల్ల యువత ముందుకెళ్లే అవకాశం లేకుండా పోయిందని ప్రధాని మోడీ విమర్శించారు. రాష్ట్రంలోని వెల్లూరులో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన ప్రసంగించారు. డీఎంకే ఒకే ఫ్యామిలీకి చెందిన సంస్థగా మరిందని ఆరోపించారు. అవినీతిలో డీఎంకే మొదటి కాపీరైట్ కలిగి ఉందని, రాష్ట్రం మొత్తాన్ని దోపిడీ చేసిందని విమర్శించారు. ‘డీఎంకే తమిళనాడును పాత ఆలోచనలు, పాత రాజకీయాల్లో బంధించాలనుకుంటోంది. ఈ కారణంగా యువత ముందుకు వెళ్లే అవకాశం లేదు’ అని తెలిపారు. తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా డీఎంకే పనిచేస్తోందని మండిపడ్డారు.
డీఎంకే ప్రజలను భాష, ప్రాంతం, విశ్వాసంతో విభజించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీనిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని త్వరలోనే వారికి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. డీఎంకే ఒక్క ఓటు కూడా పొందే పరిస్థితిలో లేదన్నారు. ‘అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు నాయకత్వం వహించాల్సిన సమయం ఇది. కానీ తమిళనాడు అభివృద్ధిని సాధించడం లేదు’ అని వ్యాఖ్యానించారు. తమిళ ప్రజల ఆకాంక్షలను కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. 2014కి ముందు భారతదేశం కుంభకోణాలకు ప్రసిద్ధి చెందిందని, కానీ ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని కొనియాడారు. తమిళనాడులో ఎన్డీయే, బీజేపీకి అపూర్వ మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.