కేజ్రీవాల్‌కు దురాశే దు:ఖాన్ని మిగిల్చింది : సంతోష్ హెగ్డే

దిశ, నేషనల్ బ్యూరో : ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌, అన్నా హజారేలతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్.సంతోష్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-03-22 12:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌, అన్నా హజారేలతో కలిసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్.సంతోష్ హెగ్డే కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం అనే మాయ దురాశకు.. దురాశ అనే అలవాటు దు:ఖానికి దారి తీస్తుందనే దానికి కేజ్రీవాల్ అరెస్టే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని ఆయన కామెంట్ చేశారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ పనితీరును చూసిన తాను నిరాశకు గురయ్యానని సంతోష్ హెగ్డే తెలిపారు. ‘‘నేటికాలంలో రాజకీయాలు అవినీతి కూపంగా మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా అవినీతికి అతీతంగా మెలగడం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నదే నాడు మేం అన్నా హజారేతో కలిసి ఏర్పాటుచేసిన అవినీతి వ్యతిరేక ఉద్యమ సూత్రం. కానీ ఆ తర్వాత మా ఉద్యమ సంస్థలోని కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లే ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. వాళ్లు తీసుకున్నది సరైన నిర్ణయమని నేను ఎన్నడూ నమ్మలేదు. అప్పట్లో కేజ్రీవాల్ స్వయంగా మా ఇంటికి వచ్చి ఆప్‌లో చేరాలని కోరారు. నేను నో చెప్పాను’’ అని సంతోష్ హెగ్డే వివరించారు.

ఇలా చేయడం నేరమేం కాదు..

‘‘విపక్షాన్ని నిర్మూలించేందుకే కేంద్రంలోని బీజేపీ సర్కారు ఈడీని ఉసిగొల్పుతోందనే వాదనను నేను నమ్మను. అయితే ప్రత్యేకించి కొన్ని పార్టీలను టార్గెట్‌గా చేసుకుంటున్నారంటే మాత్రం ఒప్పుకుంటాను. అయితే ఇలా చేయడం నేరమేం కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్లు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తేనే.. భవిష్యత్తులో ప్రతిపక్షాలు అధికారంలోకి వచ్చాక బీజేపీని టార్గెట్ చేస్తాయి. ఈవిధమైన వైఖరి సమన్యాయానికి దారితీస్తుంది. అధికార, ప్రతిపక్షాలు పరస్పరం దర్యాప్తులకు దూరంగా ఉండిపోతే అవినీతి వ్యవహారాలు బయటకు రావు. ఇప్పటికైతే కనీసం 50 శాతం మేర న్యాయం జరిగింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News