గోద్రా అల్లర్లపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Update: 2023-09-27 11:23 GMT

గాంధీనగర్: 2002 సంవత్సరంలో గుజరాత్‌లో జరిగిన గోద్రా అల్లర్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటన జరిగిన సమయానికి తనకు సీఎంగా పెద్దగా అనుభవం లేదని, కానీ ప్రజల్ని పూర్తిగా నమ్మానని చెప్పారు. అప్పట్లో కొంతమంది గుజరాత్‌కు చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర చేశారని, కానీ ఇప్పుడు రాష్ట్రం రూపురేఖలే మారిపోయాయని తెలిపారు. గుజరాత్‌లో జరిగిన ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సులో ప్రధాని మోడీ ఈ కామెంట్స్ చేశారు. 2002 సంవత్సరంలో గుజరాత్ వ్యాప్తంగా విద్వేషాలను ప్రచారం చేయాలని, రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని కొందరు భావించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

తన సారథ్యంలోని గుజరాత్ సర్కారు అభివృద్ధిపై ఫోకస్ చేసినందువల్లే.. ఆ ఘటన నుంచి రాష్ట్రం వేగంగా కోలుకోగలిగిందని వెల్లడించారు. ప్రపంచంతో ముఖాముఖిగా మాట్లాడే స్థాయిలో గుజరాత్‌కు ధైర్యం తీసుకురాగలిగామని మోడీ వివరించారు. గత ప్రభుత్వాలు రాజకీయాలు చేసి గుజరాత్ అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. రాష్ట్రానికి విదేశీపెట్టుబడులు రాకుండా కుట్ర చేశారని కాంగ్రెస్‌పై ఆయన మండి పడ్డారు. ఇన్ని బెదిరింపులకు పాల్పడినా విదేశీ పెట్టుబడిదారులు గుజరాత్‌కు వరుస కట్టారని చెప్పారు.


Similar News