అది మానసిక క్రూరత్వానికి సమానం.. అలహాబాద్ హైకోర్టు
తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామికి చాలా కాలంపాటు శారీరకంగా దూరంగా ఉండటాన్ని కూడా మానసిక క్రూరత్వంగానే పరిగణించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది.
అలహాబాద్ (యూపీ): తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామికి చాలా కాలంపాటు శారీరకంగా దూరంగా ఉండటాన్ని కూడా మానసిక క్రూరత్వంగానే పరిగణించాల్సి ఉంటుందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఫ్యామిలీ కోర్టు తన విడాకుల పిటిషన్‌ను కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈమేరకు కామెంట్స్ చేసింది. "పిటిషనర్ భార్య చాలా ఏళ్లుగా అతడికి దూరంగా జీవిస్తున్నట్లు రికార్డుల ద్వారా స్పష్టమవుతోంది.
వివాహ బాధ్యతను నిర్వర్తించడానికి అతడి భార్య తిరస్కరించిందని అర్ధమవుతోంది. దీంతో వాళ్ల వివాహ బంధం పూర్తిగా తెగింది" అని న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో పిటిషనర్ (భర్త)కు అతడి భార్య మానసిక క్రూరత్వం ప్రాతిపదికన గురువారం విడాకుల డిక్రీని మంజూరు చేసింది. "తగిన కారణం లేకుండా జీవిత భాగస్వామి తన భాగస్వామితో ఎక్కువ కాలం శారీరకంగా దూరంగా ఉండకూడదు. అది మానసిక క్రూరత్వానికి సమానం" అని బెంచ్ తెలిపింది. ఫ్యామిలీ కోర్టు "హైపర్ టెక్నికల్"గా వ్యవహరించి.. బాధిత భర్త విడాకుల పిటిషన్‌ను కొట్టేసిందని అభిప్రాయపడింది.