ఆర్టికల్ 370 రద్దు తర్వాతే కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య స్థాపన : ప్రధాని మోడీ

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా 2019లో జమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం స్థాపితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

Update: 2023-08-07 16:23 GMT

న్యూఢిల్లీ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా 2019లో జమ్మూకాశ్మీర్‌లో ప్రజాస్వామ్యం స్థాపితమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. తమ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత.. మొట్టమొదటిసారిగా కాశ్మీర్‌లోని గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్ లకు ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో 33,000 మందికిపైగా స్థానిక ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పంచాయతీరాజ్‌ సంస్థల బలోపేతానికి ఎలాంటి కృషి జరగకపోవడం వల్లే ఇంత ఆలస్యంగా జమ్మూకాశ్మీర్‌లో స్థానిక సంస్థల పోల్స్ జరిగాయని ఆరోపించారు.

హర్యానాలో జరుగుతున్న క్షేత్రీయ పంచాయతీ రాజ్ పరిషత్‌ కార్యక్రమంలో ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. "నేను ఇచ్చే హామీలు.. ఎన్నికల హామీలు కావు. నేను ఏదైనా హామీ ఇస్తే దాన్ని వాస్తవరూపంలోకి మారుస్తా" అని చెప్పారు. "కాంగ్రెస్ హయాంలో జిల్లా కేంద్రాలను డెవలప్ చేయకుండా గాలికి వదిలేశారు.. దేశంలోని మూడింట రెండొంతుల జనాభా నివసించే గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ వసతి, నీటి వసతి, బ్యాంకులు వంటివి కూడా వాళ్లు ఏర్పాటు చేయించలేదు" అని ప్రధాని మోడీ విమర్శించారు.


Similar News