Delhi: మిమ్మల్ని బ్లాక్ చేయమని ప్రభుత్వాన్ని కొరతాం.. వికీపీడియాపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

Update: 2024-09-05 10:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం నచ్చకపోతే ఇక్కడ పనిచేయకండి.. మీ వ్యాపార లావాదేవీలను మూసివేయాలని, వికీపీడియాను బ్లాక్ చేయమని ప్రభుత్వాన్ని అడుగుతాము అని ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ చావ్లా వికీపీడియా సంస్థను హెచ్చరించారు. వార్త సంస్థ ఏఎన్ఐ పేజీలో సవరణలు చేసిన వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయడంలో వికిపీడియా వైఫల్యంపై కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇందుకు వికిపీడియా సంస్థకు కోర్టు దిక్కార నోటీసులు జారీ చేసింది. అంతేగాక తదుపరి విచారణకు వికీపీడియా ప్రతినిధి తప్పక హాజరవ్వాలని ఆదేశించింది.

ప్రభుత్వ అధికారిక వార్త సంస్థ ఏఎన్ఐ వికీపీడియా పేజీలో పరువు నష్టం కలిగించే సవరణలకు సంస్థ అనుమతించిందని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ విషయంలో వికీపీడియాకు హైకోర్టు సమన్లు జారీ చేసింది. అలాగే ఏఎన్ఐ పేజీలో సవరణలు చేసిన ముగ్గురు వ్యక్తుల సమాచారాన్ని బహిర్గతం చేయాలని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను సంస్థ పాటించలేదని ఆరోపిస్తూ.. ఏఎన్ఐ కోర్టు దిక్కార పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై వికీపీడియ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలకు సంబంధించి కొన్ని సమర్పణలు చేయాల్సి ఉందని, సంస్థ భారతదేశంలో ఆధారితం కానందున వారు హాజరు కావడానికి సమయం పట్టిందని చెప్పారు.

ఈ వాదనలపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశింది. ఈ వాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపిన జస్టిస్ చావ్లా.. కోర్టు దిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేగాక ఇది భారతదేశంలో డిఫెండెంట్ నంబర్ 1 సంస్థ కాదనే ప్రశ్న కాదని చెప్పారు. మేము మీ వ్యాపార లావాదేవీలను ఇక్కడ మూసివేస్తామని, వికీపీడియాను బ్లాక్ చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని మండిపడ్డారు. ముందుగా మీరు కూడా వాదనను స్వీకరించారని, మీకు ఇండియా నచ్చకపోతే.. దయచేసి ఇక్కడ పనిచేయకండి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ కేసును అక్టోబర్ 25కు వాయిదా వేస్తున్నామని, ఆ రోజు వికీపీడియా అధికారిక ప్రతినిధి హైకోర్టు వ్యక్తిగతంగా హజరు కావాలని ఆదేశించారు.


Similar News