దేశద్రోహం కేసులో షర్జీల్ ఇమామ్ కు బెయిల్
ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్ కు హైకోర్టులో ఊరట దక్కింది. దేశద్రోహం కేసులో ఆయనకు బెయిల్ దొరికింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసులో విద్యార్థి నాయకుడు షర్జీల్ ఇమామ్ కు హైకోర్టులో ఊరట దక్కింది. దేశద్రోహం కేసులో ఆయనకు బెయిల్ దొరికింది. జనవరి 2020 నుంచి కస్టడీలో ఉన్న ఇమామ్.. బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసులో ఇమామ్ నిందితుడిగా ఉన్నాడు. మతఅల్లర్ల వెనుక ఇమామ్ కుట్ర ఉందని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. మార్చిలో బెయిల్ కోరుతూ అతడు చేసిన వినతిని పోలీసులు వ్యతిరేకించారు. మైనారిటీలను రెచ్చగొట్టేలా ఇమామ్ ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 2020లో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. సీఏఏ, ఎన్ఆర్సీ కి వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో 53 మంది చనిపోగా, 700 మంది గాయపడ్డారు. ఈ కేసులో షర్జీల్ ఇమామ్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ ఫౌండర్ ఖలీద్ సైఫీ, ఉమర్ ఖలీద్ సహా పలువురిని సూత్రధారులుగా పోలీసులు పేర్కొన్నారు. వారిపై ఉపా చట్టం కింద కేసునమోదు చేశారు.