కెప్టెన్ అన్షుమాన్ భార్యను ఉద్దేశించి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై కేసు నమోదు

కీర్తి చక్ర గ్రహీత అమర జవాన్ కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్యపై ఇటీవల సోషల్‌మీడియాలో కొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే

Update: 2024-07-13 08:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కీర్తి చక్ర గ్రహీత అమర జవాన్ కెప్టెన్ అన్షుమాన్ సింగ్ భార్యపై ఇటీవల సోషల్‌మీడియాలో కొంతమంది అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిని సీరియస్‌‌గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యు) సోమవారం సుమోటోగా విచారణ చేపట్టి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, శనివారం వారు కేసు నమోదు చేశారు. ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ (IFSO) సెల్, భారతీయ న్యాయ్ సంహిత చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. అసభ్యకరమైన వ్యాఖ్యల తాలుకూ పూర్తి వివరాలు ఇవ్వాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ను కూడా పోలీసులు సంప్రదించారు.

2023 జులైలో సియాచిన్‌లోని గ్లేసియర్ సమీపంలోని ఆర్మీ క్యాంపులో మెడికల్ ఆఫీసర్‌‌గా పనిచేస్తున్న కెప్టెన్ అన్షుమాన్ సింగ్, అక్కడ జరిగిన భారీ అగ్నప్రమాదంలో తన ప్రాణాలకు తెగించి సహచరులను కాపాడారు. ఈ ప్రయత్నంలో ఆయనకు మంటలు అంటుకుని తీవ్ర గాయాలై మృతి చెందారు. అన్షుమాన్ ధైర్య సాహసాలు, త్యాగానికి ప్రతిఫలంగా కేంద్రం మరణానంతరం కీర్తిచక్రతో సత్కరించింది. ఇటీవల కెప్టెన్ అన్షుమాన్ తరపున ఆయన భార్య స్మృతి సింగ్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును స్వీకరిస్తున్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. కొంతమంది ఆమెపై సోషల్‌మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇప్పుడు దీనిపై ఢిల్లీ పోలీసులు ఆ వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News