ఢిల్లీ జల్ బోర్డు కేసు..తొలి చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో జరిగిన అక్రమాలకు సంబం ధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)లో జరిగిన అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం తొలి చార్జిషీట్ దాఖలు చేసింది. దీనిని ఢిల్లీలోని ప్రత్యేక మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) కోర్టులో దాఖలు చేశారు. చార్జిషీట్‌లో ఓ సంస్థను, నలుగురు వ్యక్తులను నిందితులుగా చేర్చారు. డీజేబీ మాజీ చీఫ్ ఇంజనీర్ జగదీష్ కుమార్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ కుమార్ అగర్వాల్, మాజీ ఎన్‌బీసీసీ జనరల్ మేనేజర్ డీకే మిట్టల్, తేజిందర్ సింగ్, ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌లను చార్జిషీట్‌లో చేర్చింది. డీజేపీ ఇచ్చిన కాంట్రాక్టులో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపించింది. దీని ద్వారా వచ్చిన డబ్బును ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ఖర్చుకు ఉపయోగించిందని తెలిపింది. ఈ కేసులో విచారణ నిమిత్తం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. కానీ విచారణకు కేజ్రీవాల్ హాజరుకాలేదు.
డీజేబీ కాంట్రాక్టులో భాగంగా ఎన్‌కేజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు మొత్తం రూ.38 కోట్లకు కాంట్రాక్టును అందించారని, కానీ కేవలం 17కోట్లు మాత్రమే లెక్క చూపారని ఆరోపిస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. కంపెనీ నకిలీ పత్రాల ద్వారా కాంట్రాక్ట్‌ను పొందిందని తెలిపింది. దీని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపడుతోంది. ఇందులో భాగంగా కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, ఎన్‌డీ గుప్తా, మాజీ డీజేపీ సభ్యుడు శలభ్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్ పంకజ్ మంగళ్, మరికొందరి ఇళ్లపై ఈడీ దాడులు చేసింది. అంతకు ముందు అరోరా, అగర్వాల్‌లను ఈడీ అరెస్టు చేసింది. ఈ క్రమంలోనే తొలి చార్జిషీట్ దాఖలు చేసింది.