కేజ్రీవాల్ భార్య సునీతకు ఢిల్లీ హైకోర్టు నోటీసు..కారణమేంటి?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది.

Update: 2024-06-15 07:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టు శనివారం నోటీసులు జారీ చేసింది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈ సమన్లు పంపింది. మార్చి 28న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ కోర్టుకు హాజరైన విషయాన్ని వీడియో, ఆడియోలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపిస్తూ న్యాయవాది వైభవ్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కార్యకలాపాలను రికార్డింగ్ చేయడానికి అరవింద్ కేజ్రీవాల్, ఆయన పార్టీ సభ్యులు కుట్ర పన్నారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ, అమిత్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్ దీనిపై విచారణ చేపట్టింది. ఈ పోస్ట్‌లను తొలగించాలని సునీతాతో పాటు పలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పోస్టులను వెంటనే తొలగించాలని సూచించింది. సోషల్ మీడియా సంస్థలు నిబంధనలు పాటించాలని హెచ్చరించింది.


Similar News