Delhi Excise Policy Case: లిక్కర్ స్కాంలో మరో ఐదుగురిపై అనుబంధ ఛార్జిషీట్..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం కేసులో సీబీఐ మరో ఐదుగురిపై గురువారం అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.

Update: 2023-07-13 16:42 GMT

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాం కేసులో సీబీఐ మరో ఐదుగురిపై గురువారం అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఆ ఐదుగురిలో చారియట్ ప్రొడక్షన్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ రాజేష్ జోషి, ఆ కంపెనీ ఉద్యోగులు దామోదర్ ప్రసాద్ శర్మ, ప్రిన్స్ కుమార్‌తో పాటు ఇండియా అహెడ్ న్యూస్ క్రియేటివ్ హెడ్ అరవింద్ కుమార్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వాలంటీర్ చన్‌ప్రీత్ సింగ్ రాయత్‌ ఉన్నారు. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా నిందితుడిగా ఉన్న ఈ కేసులో సీబీఐ అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేయడం ఇది రెండోసారి.

ఈ ఐదుగురు నిందితులు ఢిల్లీ లిక్కర్ స్కాంలో ముడుపుల రూపంలో ముట్టిన డబ్బుల్లో దాదాపు రూ.44.54 కోట్లను గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం హవాలా రూట్‌లో పంపారని సీబీఐ విచారణలో గుర్తించారు. ఈ ఏడాది మే నెలలోనే చన్‌ప్రీత్ సింగ్ రాయత్, అరవింద్ కుమార్ సింగ్‌లను సీబీఐ అరెస్టు చేసింది. రాజేష్ జోషిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తొలుత అరెస్టు చేయగా, ఆ తర్వాత ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కోణాన్ని ఈడీ విచారిస్తోంది.


Similar News