Delhi cm: ఢిల్లీ సీఎంపై సస్పెన్స్ కంటిన్యూ.. రేసులో పర్వేష్ వర్మ ముందంజ !
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి వచ్చింది. అయితే ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా ఇంకా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో ఢిల్లీ పీఠాన్ని అధిరోహించేది ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నెల 19, 20వ తేదీల్లో కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కానీ సీఎం క్యాండిడేట్‌ను ప్రకటించకపోవడంతో ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది. 48 మంది ఎమ్మెల్యేల్లో 15 మంది పేర్లను బీజేపీ ఇప్పటికే షార్ట్‌లిస్ట్ చేసినట్టు తెలుస్తోంది. వారిలో సీఎం అభ్యర్థితో పాటు మంత్రులు, స్పీకర్ పదవులకు9 మందిని ఫైనల్‌గా ఎంపిక చేయనున్నట్టు సమాచారం. ఇందులో ప్రధానంగా పర్వేష్ వర్మ (Parvesh varma), విజేంద్ర గుప్తా, మోహన్ సింగ్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి బీజేపీలో చేరిన కైలాష్ గెహ్లాట్ పేరు సైతం కేబినెట్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది.
18న శాసనసభాపక్ష సమావేశం!
యూఎస్, ఫ్రాన్స్ పర్యటనలకు వెళ్లిన ప్రధాని మోడీ నేడు భారత్‌కు చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ముమ్మరం కానుంది. ఈ క్రమంలోనే ఆదివారం, సోమవారం రోజు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ భేటీకి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా (Amith shah), బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఇతర బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు. ఈ మీటింగ్ లోనే సీఎం అభ్యర్థిని ప్రకటించే చాన్స్ ఉంది. అనంతరం ఆ మరుసటి రోజే ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని బీజేపీ యోచిస్తోంది. దీనికి సంబంధించి భారత్ మండపం, జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం, రాంలీలా మైదాన్, అరుణ్ జైట్లీ స్టేడియం కూడా పరిశీలిస్తోంది.
పర్వేష్ వర్మకే చాన్స్!
ఢిల్లీ సీఎం రేసులో న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్ వర్మ పేరే ప్రధానంగా వినపడుతోంది. ఆయనతో పాటు ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన సీనియర్ నేత విజేందర్ గుప్తా, గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సతీష్ ఉపాధ్యాయ్, ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఆశిష్ సూద్, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతున్న జితేంద్ర మహాజన్‌ల పేర్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఢిల్లీ మంత్రివర్గంలో ముఖ్యమంత్రితో సహా మొత్తం ఏడుగురు మంత్రులు ఉండొచ్చు. కాగా, ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.
బీజేపీలో అంతర్గత విభేదాలు: మాజీ సీఎం అతిశీ
ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ చర్యలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం అతిశీ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంత్రి పదవుల కేటాయింపుపై బీజేపీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత వివాదం ఉందని ఆరోపించారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకుడు ప్రజా ధనాన్ని దోపిడీ చేయడానికి మంత్రి పదవుల పోరాటంతో నిమగ్నమై ఉన్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశం బీజేపీకి లేదని, నిరంతరం ఆప్‌ను నిందించడానికే వారు కంకణం కట్టుకున్నారని చెప్పారు. హామీలు నెరవేర్చడంలో విఫలమైన తర్వాత వారు ఆప్ ప్రభుత్వంపై నిందలు వేస్తారన్నారు.