రూ.25 కోట్ల నగల చోరీ కేసులో దొరికిన దొంగలు.. వేరే రాష్ట్రాల్లో కూడా చోరీలు
సంచలనం సృష్టించిన రూ.25 కోట్ల విలువైన నగల చోరీ కేసును ఢిల్లీ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన రూ.25 కోట్ల విలువైన నగల చోరీ కేసును ఢిల్లీ పోలీసులు ఐదు రోజుల్లోనే ఛేదించారు. ఆదివారం రాత్రి బంగారం దుకాణంలోకి ప్రవేశించి నగల్ని చోరీ చేసి పరారైన ముగ్గురు దొంగలను అరెస్టు చేశారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారని గుర్తించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు లోకేశ్ శ్రీవాస్తవ, శివ చంద్రవంశీతో పాటు మరో వ్యక్తి ఉన్నారు. ఈ నిందితుల నుంచి పోలీసులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ దొంగల ముఠా గతంలోనూ ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే తరహా చోరీలకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భోగల్ ఏరియాలో ఉమ్రావ్ సింగ్ అనే వ్యక్తికి బంగారం దుకాణం ఉంది. ఆదివారం రాత్రి ఈ దుకాణంలోని స్ట్రాంగ్ రూమ్ గోడకు రంధ్రం చేసి.. లోపలికి చొరబడిన దొంగలు దాదాపు రూ.25 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దుకాణంలోని సీసీటీవీలను సైతం ధ్వంసం చేసి నగలతో ఉడాయించారు. నగల దుకాణం నిర్వాహకుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు.